ఏమాటకామాట చెప్పుకోవాలి. సంపాదన అంటే... హీరోయిన్లదే. ఒకేసారి నాలుగైదు సినిమాలకు కాల్షీట్లు ఇచ్చేస్తుంటారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు గంతులు వేస్తుంటారు. మధ్యమధ్యలో ప్రత్యేక గీతాలు, షాపింగ్‌మాల్స్ ప్రారంభోత్సవాలు, బ్రాండ్ అంబాసిడర్లు.. ఇవన్నీ బోనస్‌లుగా వస్తుంటాయి. ఇక ఇది పూర్తిగా ఓటీటీల కాలం ఆయె. అటు నుంచి కూడా కావల్సినంత రాబడి.
ఇప్పుడు సమంత కూడా నాలుగు చేతులా సంపాదిస్తోంది. సినిమాలు, ఓటీటీలూ, కమర్షియల్ యాడ్లూ అంటూ తెగ బిజీగా ఉన్న సమంత ఇప్పుడు `పుష్ప`లో ఓ ఐటెమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత తన కెరీర్‌లో చేస్తున్న తొలి ఐటెమ్ గీతం ఇది. అందుకోసం ఆమె భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పాట కోసం సమంతకు ఏకంగా 1.60 కోట్లు ఆఫర్ చేశారట. నిజంగా ఇది పెద్ద మొత్తమే.
ఈ పాట కోసం సమంత కేవలం నాలుగు రోజుల కాల్షీట్లు కేటాయించింది. అంటే రోజుకి 40 లక్షలన్నమాట. సమంత హీరోయిన్ గా చేస్తే ఒక్కో సినిమాకి కనీసం 2 కోట్లయినా సంపాదిస్తుంది. కానీ.. అందుకోసం దాదాపు నెల రోజుల కాల్షీట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆ మొత్తాన్ని కేవలం 4 కాల్షీట్లతోనే సంపాదించేస్తోంది. నిజంగానే ఐటెమ్ సాంగులు చేయడంలో ఉన్నంత సుఖం లేదు కదా?