సిటీమార్ తరవాత... సంపత్ నంది కామ్ అయిపోయాడు. తన తదుపరి సినిమా ఎవరితో? ఎప్పుడు? అనే విషయంలో నిన్నా మొన్నటి వరకూ క్లారిటీ రాలేదు. అయితే... ఇటీవల సాయిధరమ్ తేజ్‌కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు సంపత్ నంది. ఇప్పుడు రవితేజ కోసం కూడా ఓ కథ రెడీ చేసేశాడని, ఇటీవల రవితేజని కలిసి ఈ కథ విషయమై చర్చలు జరిపాడని సమాచారం అందుతోంది. రవితేజ - సంపత్ నంది కాంబినేషన్‌లో ఇది వరకు బెంగాల్ టైగర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఓకే అనిపించుకొంది. అందుకే ఇప్పుడు రవితేజ మరో ఆఫర్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
అయితే ముందుగా సాయిధరమ్ సినిమానే పట్టాలెక్కుతుంది. ఆ తరవాతే రవితేజ సినిమా ఉంటుంది. ఆమధ్య బాలకృష్ణతోనూ సంపత్ నంది ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు.
కాకపోతే... సంపత్ నంది దగ్గర మాస్ హీరోలకు సరిపడా కథలున్నాయన్నది వాస్తవం. అందుకే వరుసగా కథలు చెప్పి ఒప్పించుకుంటున్నాడు. త్వరలోనే... సాయిధరమ్ - సంపత్ నంది సినిమా పట్టాలెక్కుతుంది. ఇది కూడా మాస్ కమర్షియల్ సినిమానే అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఓ వెరైటీ టైటిల్ ని పరిశీలిస్తున్నారని, త్వరలోనే టైటిల్ రివీల్ చేస్తారని సమాచారం.