దర్శకుడు పూరి జగన్నాథ్ ఏదో యధాలాపంగా మాటలు చెప్పేయడు. మనసులో ఏముంటే అదే చెప్పేస్తాడు. అందుకే పూరి ఏ మాట చెప్పినా అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంటుంది. బర్నింగ్ స్టార్ సంపూర్నేష్‌తో సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాట బయపెట్టిన పూరి, తెలుగు సినీ పరిశ్రమలో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పూరి అనుకున్నాడంటే, అది పెద్ద కష్టం కాదు. గట్టిగా రెండు మూడు నెలల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేయగలడు. అదే పూరి ప్రత్యేకత. ఛార్మితో 'జ్యోతిలక్ష్మి' లాంటి సినిమా పూరి తప్ప ఇంకెవరు చేయగలరు? స్టార్ హీరోలతో సినిమాలు చేసే సత్తా ఉన్నా పూరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేస్తున్న పూరి, సంపూతో సినిమా చేసే అవకాశాలైతే మెండుగానే ఉన్నాయని చెప్పవచ్చు. పూరితో సంపూ సినిమా సెట్స్ మీదకు వెళితే తెలుగు తెరపై అదొక సెన్సేషనల్ కాంబినేషన్ అవుతుంది. సంపూ కొత్త సినిమా 'కొబ్బరిమట్ట' ప్రమోషన్స్ కోసం పూరి జగన్నాథ్ వద్దకు ఆ సినిమా టీమ్ వెళ్ళినప్పుడు సంపూతో సినిమా విషయాన్ని పూరి బయటపెట్టాడు. ఇంకో వైపున సంపూ 'కొబ్బరిమట్ట' ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది విడుదలకు ముందే. 'హృదయకాలేయం' తర్వాత అంతటి విజయాన్ని తనకు 'కొబ్బరిమట్ట' అందిస్తుందని సంపూ ధీమాగా కనిపిస్తున్నాడు.