అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ష`. రష్మిక కథానాయిక. త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభించాలనుకుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకూ ప్రతినాయకుడెవరన్న సంగతి తేలలేదు. ముందు విజయ్ సేతుపతి పేరు బయటకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తరవాత... బాబీ సింహా పేరు గట్టిగా వినిపించింది. విజయ్‌కి ప్రత్యామ్నాయం బాబి సింహానే అని చిత్రబృందం కూడా గట్టిగా నమ్మింది. అయితే బాబీ సింహా కూడా డౌటే అని తేలింది. అప్పటి నుంచీ.. ప్రతినాయకుడి కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు సుకుమార్.
ఎట్టకేలకు సుకుమార్ అన్వేషణ ఫలించినట్టు టాక్. బన్నీని ఢీ కొట్టే పాత్రలో సముద్ర ఖని ని ఎంచుకున్నారని సమాచారం. తమిళంలో సముద్రఖనికి మంచి ఇమేజ్ ఉంది. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. `అల వైకుంఠపురములో`నూ.. సముద్రఖని నటించిన సంగతి తెలిసిందే. అందుకే.. హిట్ కాంబినేషన్‌ని రిపీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోగా... ప్రతినాయకుడి పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి.