దర్శకుడి నుంచి నటుడిగా మారాడు సముద్రఖని. తన విలక్షణమైన నటనకు తమిళంలో అభిమానులు తయారయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ లోనూ పాతుకుపోయాడు. `అల వైకుంఠపురములో`, `క్రాక్` సినిమాల్లో తనదైన విలక్షణమైన నటన ప్రదర్శించి.. ఇక్కడి వాళ్లనీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తన చేతిలో చాలా సినసిమాలున్నాయి. తాజాగా చిరంజీవి `లూసీఫర్`లోనూ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు తమిళంలో కంటే తెలుగులోనే సముద్రఖని బిజీ అయిపోయాడని సమాచారం. తన చేతిలో కనీసం 10 సినిమాలైనా ఉన్నాయని తెలుస్తోంది.
ఒక్కో సినిమాకీ సముద్రఖని 2 కోట్ల వరకూ పారితోషికం వసూలు చేస్తున్నాడట. అయినా సరే... తన కాల్షీట్లు దొరకడం లేదు. విచిత్రం ఏమిటంటే.. తమిళనాట సముద్రఖని కి ఈ స్థాయిలో పారితోషికం ఎవ్వరూ ఇవ్వడం లేదు. తెలుగులోనే ఇంత డిమాండ్ ఉంది. సముద్రఖని ఒక్కడే కాదు.. తమిళం నుంచి దిగుమతి చేసుకున్న విలన్లు. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇక్కడ బాగా సంపాదిస్తున్నారు. పొరిగింటి పుల్లకూరకు రుచెక్కువ అంటుంటారు కదా. అలా... పరాయి నటులంటే మనకెప్పుడూ గారాభమే. అడిగినంత ఇచ్చేస్తుంటారు. అందుకే... వాళ్ల పారితోషికాలు చుక్కల్ని తాకుతున్నాయి.