బాలీవుడ్... ఓ గురువింద గింజ!

మరిన్ని వార్తలు

కామన్ ఆడియన్స్ చూసినట్లుగా బాలీవుడ్ ప్రముఖులు 'యానిమల్' సినిమాని థియేటర్స్ లో చూసినట్లు లేరు. ఇప్పుడు ఓటీటీ విడుదల తర్వాత తీరిగ్గా చూసి రోజుకొకరు తెగ బాధ పడిపోతున్నారు. ఇంతటి పెడ ధోరణి గల సినిమా విజయం సాధించడం సమాజానికే ప్రమాదకరమని వాపోతున్నారు. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా వారికి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నాడు.


ఈ వ్యవహారంలో బాలీవుడ్ ప్రముఖల తీరు చూస్తుంటే.. సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూస బీజీఎం గుర్తు రాకమానదు. గురివిందగింజ తనకింద వున్న నలుపు ఎరగదన్నట్లుగా వుంది వారి వ్యవహారం. యానిమల్ అడల్ట్ కంటెంట్, వైల్డ్ కంటెంట్, బూతులతో నిండిపోయిందని తెగ మదనపడిపోతున్న బాలీవుడ్ పెద్దలు ఒకసారి వారి చరిత్రని గుర్తు చేసుకోవడం మర్చిపోతున్నారు.


అసలు వెండితెరపై నగ్న ప్రదర్శనలు మొదలుపెట్టింది, సెక్స్ ఎరోటిక్ సినిమాలకు శ్రీకారం చుట్టిందే బాలీవుడ్డు. అక్రమ సంబంధాలని గ్లోరిఫై చేస్తూ సినిమాలు తీసి జనాల మీదకు వదిలారు. సహజత్వం పేరుతో దారుణమైన సన్నివేశాలని చిత్రీకరించి వెండితెరపై చూపించిన ఘనత వారిది. కాలేజీలు కేవలం ప్రేమించుకోవడానికి కేంద్రాలని, ఆఫీసులు అక్రమ సంబంధాలకు నిలయాలని,  శారీరిక సుఖాలే మనిషికి పరమావధిని.. ఇలా చెప్పుకుంటే పోతే లెక్కకుమించిన వైపరీత్యాలని తెరపై చిత్రీకరించిన చరిత్ర వారిది.
 

యానిమల్ పై బాలీవుడ్ పెద్ద బాధ చూస్తుంటే.. నిజానికి వారి బాధ యానిమల్ కంటెంట్ పై కాదు.. దర్శకుడిపైనని అర్ధమౌతుంది. సౌత్ నుంచి ఓ దర్శకుడు బాలీవుడ్ వెళ్లి అక్కడ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పసలేని విమర్శలతో కౌంటర్ చేయాలని చూస్తున్నారు. యానిమల్  హిందీ చిత్రసీమపై విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్ తన టచ్ ని కోల్పోయింది. ప్రేక్షకుల నాడీ పట్టుకోవడం పట్టుతప్పింది. అసలు వారి ఆడియన్స్ కి ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయో వారికి అంతు చిక్కడం లేదు. ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీ రికార్డులన్నీ రాజమౌళి, సుకుమార్, అట్లీ, లోకేష్ కనకరాజ్, సందీప్ వంగా లాంటి సౌత్ దర్శకుల  ఖాతాల్లో పడిపోయాయి. ఇక్కడే వాళ్ళ మంట మొదలైయింది. ఏదో రకంగా ఈ ఆధిపత్యానికి అడ్డుకట్టవేయడానికి చూస్తున్నారు.
  

సినిమా అనేది విమర్శకుల, సంఘ సంస్కర్తల మీడియం కాదు. సినిమా ప్రేక్షకుల మీడియం. ఏ సినిమా తీసినా అంతిమంగా ప్రేక్షకులకు నచ్చిందే గొప్ప సినిమా. ఈ విషయంలో యానిమల్ కు ప్రేక్షకులు సపోర్ట్ లభించింది. సినిమా జనాలు చూశారు. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు ఇచ్చారు. అక్కడితో అది ముగిసింది. అయితే ఇప్పుడు యానిమల్ పై విమర్శలు చేస్తున్న క్రమంలో బాలీవుడ్ పెద్దలు చులకన అవుతున్నారు.


తన సినిమాపై విమర్శలు చేసిన వారికి సందీప్ వంగా సరైన జవాబులు చెబుతున్నాడు. లాజిక్ తో సహా విడమర్చి బదులిస్తున్నాడు. సందీప్ లాజిక్కులు బాలీవుడ్ పెద్దలకు నోటమాటరాని పరిస్థితి. యానిమల్ లో బూతులు ఎక్కువున్నాయని విమర్శించిన రచయిత జావేద్ అక్తర్ కు బదులుగా.. ‘దునియాలో ఉన్న బూతులన్నీ మీర్జాపూర్‌లో ఉన్నాయి. ఈ సిరీస్ నిర్మాత పర్హాన్ అక్తర్‌.  తన కొడుకు పనిని జావేద్ ఎందుకు చెక్ చేయడం లేదు. వీళ్లు నాకు చెబుతున్నారు. ఇదంతా డ్రామా' అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. ఇదొక్కటే కాదు.. ఎలాంటి విమర్శ వచ్చినా సందీప్ దగ్గర లాజిక్ కూడిన అన్సర్స్ వున్నాయి. సందీప్ అన్సర్స్ వింటున్న ఆడియన్స్ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ పెద్దలు ఇంకా పలుచన కాకముందే యానిమల్ విమర్శలకు పుల్ స్టాప్ పెడితే వారికే మంచిది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS