సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పుష్ప 2 బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌గాయాలపాలై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, సెక్యూరిటీ సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురించి సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ... అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం మాకు లేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. వారు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని తెలియజేశారు.