సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. అలానే.... కన్నడ చిత్రసీమలోనూ డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. ఓ డ్రగ్ డీలర్ పోలీసులకు దొరికిపోవడం, అతని డైరీలో కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖులు ఫోన్ నెంబర్లు ఉండడంతో... కన్నడ వుడ్ మొత్తం కదిలిపోయింది. ముఖ్యంగా సంజనా, రాణిగి త్రివేదీలు ఈ కేసులో గట్టిగానే ఇరుక్కున్నారు. ఇది వరకే వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులోనూ హాజరు పరిచారు. పోలీసుల విచారణలో సంజనకు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
సంజనకు బెంగళూరులో పది ఫ్లాట్స్ ఉన్నట్టు తేలింది. వాటి విలువ కనీసం 25 కోట్లు ఉంటుందని అంచనా. సంజన చేసిన సినిమాలు, అందుకున్న పారితోషికం లెక్కలోనికి తీసుకుంటే, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్టే. డ్రగ్స్ సరఫరాలోనే ఇంత మొత్తం సంపాదించే వీలుందన్నది పోలీసుల అనుమానం. బెంగళూరులో సంజన పేరు మీద ఎక్కడెక్కడ ఆస్తులున్నాయన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు... ఇది వరకే హవాలా రూపంలో కొంత మొత్తాన్ని తరలించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కేసులో సంజనని, రాణిగిని పోలీసులు వేర్వేరుగా విచారిస్తున్నారు. అయితే.. వీరిద్దరూ పోలీసులకు ఎలాంటి అదనపు సమాచారాన్నీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటేస్తున్నారని, విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు.