కరోనా చిత్రసీమని పూర్తిగా కబళించేసింది. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్లీ షూటింగులు మొదలైనా.. ఇది వరకటి హడావుడి మాత్రం కనిపించడం లేదు. సెట్లో అడుగుపెడదామనుకున్న ఇంకొన్ని సినిమాలు - ఇప్పుడు మళ్లీ డోలాయమాన పరిస్థితుల్లో పడ్డాయి. వాటిలో `పుష్ష` ఒకటి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా `పుష్ష`. రష్మిక కథానాయిక. కేరళ అడవుల్లో కొంతమేర షూటింగ్ చేశారు. మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్నప్పుడు కరోనా వచ్చి, షూటింగ్ వాయిదా పడింది. కేరళ ఎపిసోడ్ మొత్తం.. మారేడుమల్లి అడవుల్లో తీద్దామని ప్లాన్ చేశారు.
కానీ అదీ కష్టమైపోయింది. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గి - మళ్లీ షూటింగులు చేసుకోవడానికి అనుమతులు వచ్చాయి. దాంతో.. సుకుమార్ ప్లాన్ మళ్లీ మారింది. మారేడు మల్లి అడవుల్లో కాకుండా, కేరళలోనే ఈ సినిమాని మొదలెట్టాలని భావిస్తున్నాడు సుకుమార్. దాంతో మారేడుమల్లి నుంచి కేరళకు ఈ సినిమా షిఫ్ట్ అవ్వబోతోంది. కేరళలోని అడవుల్లో షూటింగులకు అనుమతులు ఇవ్వాలని మైత్రీ మూవీస్ అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. అక్కడి నుంచి అనుమతులు రావాల్సివుంది.
ఎంతమంది క్రూకి అనుమతులు ఇస్తారు? అసలు ఎంత మంది తో ఈ షూటింగ్ సాధ్యం అవుతుంది? అనే విషయంపై సుకుమార్ టీమ్ తీవ్ర తర్జన భర్జనలు జరుపుతోంది. ఎంత కాదన్నా.. `పుష్ష` షూటింగ్ నవంబరు కంటే ముందు మొదలవ్వడం దాదాపు అసాధ్యం అని తెలుస్తోంది. నిజానికి అక్టోబరులో `పుష్ష`ని పట్టాలెక్కిద్దాం అనుకున్నాడు సుకుమార్. కానీ.. షూటింగ్ కేరళకు షిఫ్ట్ అవ్వడంతో... ఈ షూటింగ్ ఆలస్యం కాబోతోంది.