ఈ సంక్రాంతికి ఇప్పటికే రెండు సినిమాలు ఫిక్సయ్యాయి. ఆర్.ఆర్.ఆర్‌తో పాటు రాధే శ్యామ్ విడుదల కాబోతోంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే. వీటి మధ్య బంగార్రాజు కూడా రావడానికి రెడీగా ఉన్నాడు. జనవరి 7న `ఆర్.ఆర్.ఆర్` వస్తుంది. ఈసినిమా ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్సాహం.. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులకు మెండుగా ఉంది. 2022ని ఆర్.ఆర్.ఆర్‌తో ఘనంగా స్వాగతం పలకబోతోంది.
అయితే.. ఈ ప్రయాణం అంత సులువుగా మొదలయ్యేలా లేదు. ఎందుకంటే.. థర్డ్ వేవ్ భయాలు ఇప్పుడు మరీ పీక్స్‌కి చేరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్‌ఫ్యూ గురించి ఆలోచిస్తున్నాయి. మహా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయమై కీలకమైన నిర్ణయం తీసుకుంది. నైట్ కర్‌ఫ్యూ విధించడమే కాదు. థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి పరిమితం చేస్తూ జీవో జారీ చేసింది. ఇది ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ సినిమాలకు పెద్ద దెబ్బ. ఎందుకంటే... ఈ రెండు సినిమాలూ హిందీ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేశాయి. అక్కడ వసూళ్లకు గండి పడే ప్రమాదం ఉంది.
మహారాష్ట్ర బాటలోనే తెలుగు ప్రభుత్వాలూ నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటి? పైగా చిత్రసీమపై సీతకన్ను వేసింది ఏపీ గవర్నమెంట్. ఏ చిన్న సందు దొరికినా.. చిత్రసీమపై కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకంజ వేయడం లేదు. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ పెడితే.... ఇక సినిమాల పరిస్థితి దారుణంగా ఉంటుంది. సంక్రాంతి సీజన్ లో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు చూపించాలని ఏ నిర్మాతా అనుకోడు. అదే జరిగితే.... సంక్రాంతి సినిమాలన్నీ ఆగిపోయినట్టే.