2024 సంక్రాంతి సినిమాల సంబరం అయిపోతూ ఉంది. సినిమాలొచ్చేశాయ్. ఇప్పుడు ఆ సినిమాల వసూళ్ల గురించీ, బలాబలాల గురించి మాట్లాడుకొంటూనే ఉన్నాం. ఈలోగా 2025 సంక్రాంతి బెర్తులు కూడా ఫుల్ అయిపోయినట్టే కనిపిస్తోంది పరిస్థితి. 2025 సంక్రాంతికి మేం రెడీ అంటూ కొన్ని సినిమాలు ముందస్తుగానే కర్చీఫులు రెడీ చేసుకొన్నాయి. అందులో 'విశ్వంభర' ఒకటి. చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ఇప్పటికి 20 శాతం మాత్రమే షూటింగ్ అయ్యింది. 2025 సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా ముస్తాబవుతోంది.
నాగచైతన్య 'తండేల్' కూడా సంక్రాంతికే రానుంది. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న సినిమా ఇది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. నాగచైతన్య ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సంక్రాంతికి వస్తే.. వసూళ్లు బాగుంటాయి. బడ్జెట్ పరంగా వెసులుబాటు ఉంటుంది. అందుకే ఈ ఐడియా.
దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమాల్లో 'శతమానం భవతి' ఒకటి. సంక్రాంతికి విడుదలై.. మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు 2025 సంక్రాంతికి 'శతమానం భవతి - నెక్ట్స్ పేజీ' విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి సీజన్‌ని బాలకృష్ణ మిస్ అయ్యాడు. అయితే 2025 పండక్కి మాత్రం కచ్చితంగా బాలయ్య నుంచి ఓ సినిమా వచ్చే అవకాశం ఉంది.
2025 సంక్రాంతి గురించి ఇప్పుడే మాట్లాడడం కాస్త ఎర్లీనే. కాకపోతే.. 2024లో చూశాం కదా? 'ముందు మేం విడుదల తేదీ ప్రకటించాం. కాబట్టి మా సినిమానే ముందు రావాలి' అంటూ బాక్సాఫీసు దగ్గర గలాటా జరిగింది. ఓ సినిమాని వెనక్కి తోయడానికి చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. చివరికి ఈగల్ తప్పుకొంది. ఇలాంటి తలనొప్పులు రాకుండా సంక్రాంతి సీజన్ లో బెర్తు ఖాయం చేసేసుకొంటున్నారు నిర్మాతలు. అప్పుడు పరిస్థితిని బట్టి చూద్దాం.. అన్నట్టుగా. అంతే తేడా!