సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సినిమాలు ఒక్కసారే వస్తున్నాయంటే ధియేటర్స్ కొరత తప్పదు. జనవరి 9న విడుదల కానున్న 'ఎన్టీఆర్ - కథానాయకుడు' చిత్రం అత్యధిక ధియేటర్స్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత రోజుల గ్యాప్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదీ పెద్ద సినిమానే కావడంతో చరణ్ కోసం కొన్ని ధియేటర్స్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అభిమానుల్లో కొంత నిరాశ నెలకొనే అవకాశం లేకపోలేదు.
నిర్మాతల అండర్ స్టేండింగ్‌తోనే ఈ అడ్జస్ట్‌మెంట్ జరిగినా, అభిమానుల్లో గొడవలు చెలరేగడం సర్వసాధారణం. రాద్ధాంతం అయితే తప్పనిదే. గతంలో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ' టైంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడే బాలయ్య వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' రిలీజైంది. అప్పుడూ ఇదే పరిస్థితి నెలకొన్నా, నిర్మాతలు చాకచక్యంగా వ్యవహరించారు. రెండు సినిమాలూ బాక్సాఫీస్‌కి మంచి వసూళ్లు రాబట్టాయి. అదే టైంలో వచ్చిన 'శతమానం భవతి'కి కూడా ధియేటర్స్‌లో చోటు లభించింది.
పెద్ద సినిమాలతో పాటు ఈ సినిమా కూడా భారీ వసూళ్లు రాబట్టింది. అలాగే ఇప్పుడు కూడా బాలయ్య, మెగా హీరో చరణ్ మధ్య వార్ ఎలా ఉన్నా, బాక్సాఫీస్ కాసులతో కళకళలాడాలని అభిమానులు భావిస్తున్నారు. ఇదే రేసులో మరో మెగా హీరో వరుణ్, వెంకీల మల్టీ స్టారర్ మూవీ 'ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్' కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి నలుగురు హీరోల అభిమానులకు అసలు సిసలు సంక్రాంతి కానుందని చెప్పడం ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.