ఈమధ్య కాలంలో యూ ట్యూబ్ ని షేక్ చేసేసిన పాటల్లో... `సారంగ దరియా` ఒకటి. శేఖర్‌కమ్ముల `లవ్ స్టోరీ` కోసం మంగ్లీ పాడిన పాట ఇది. ఆ పాట పాడిన పద్దతి, జానపద శైలి, దానికి తగినట్టు స్టెప్పులు వేసిన... సాయి పల్లవి.. ఈ పాటని మరో స్థాయికి తీసుకెళ్లాయి. విడుదలైన రోజు నుంచీ ఈ పాట కు రికార్డు వ్యూస్ కట్టబెడుతూనే ఉన్నారు జనాలు. ఇప్పుడు యూ ట్యూబ్ లో మరో మైలు రాయిని అందుకుంది. ఏకంగా 150 మిలియన్ల వ్యూస్ అందుకున్న పాటగా రికార్డు కెక్కింది.
ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన సినిమా ఇది. అయితే కరోనా భయాల వల్ల ముందే వాయిదా పడిపోయింది. లేదంటే ఈ పాటికి ఈ పాట కూడా వెండి తెరపై చూసేసేవాళ్లే. `ఫిదా`లో... వచ్చిండే పాటకు మించిన ఆదరణ దీనికి దక్కుతోంది. తెరపై... శేఖర్ కమ్ముల ఎలా తీశాడో చూడాలన్న కుతూహలం పెంచుతోంది. లవ్ స్టోరీ ఆడియోలో భాగంగా విడుదలైన మిగిలిన పాటలూ బాగానే ఉన్నా, అవేమీ... సారంగ దరియా... స్థాయిలో లేవన్నది వాస్తవం.