కార్తి తమిళ హీరోనే కావొచ్చు. కానీ తెలుగులోనూ తనకు మంచి మార్కెట్ వుంది. డబ్బింగ్ రూపంలో వచ్చిన తన సినిమాలు ఇక్కడ మంచి వసూళ్లు అందుకున్నాయి. `ఖైదీ` తెలుగులో సూపర్ హిట్టయ్యింది. అందుకే ఈమధ్య విడుదలైన `సుల్తాన్`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కార్తి సరసన రష్మిక కథానాయికగా నటించిన సినిమా ఇది. ప్రచార చిత్రాలు బాగుండడంతో హైప్ పెరిగింది. దాంతో ఈ సినిమాని తెలుగులో 6 కోట్లకు అమ్మారు.
ఏప్రిల్ 2న విడుదలైన ఈసినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 3 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే.. బయ్యర్లకు సగానికి సగం నష్టమన్నమాట. నైజాంలో 1.23 కోట్లు వస్తే, సీడెడ్ లో 60 లక్షలు మాత్రమే వచ్చాయి. కరోనా ఎఫెక్ట్ తో పాటు, తొలి రోజు వచ్చిన డిజాస్టర్ టాక్.. ఈ సినిమాకి పెద్ద దెబ్బ వేసింది. ఇక మీదట కార్తీ సినిమాని కొనాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.