మహేష్ బాబు సర్కారు వారి పాట ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా కట్ చేశారు. చాలా డైలాగులు వినిపించాయి. ఇదే సమయంలో 'ఏ' సర్టిఫికేట్ డైలాగులు కూడా దట్టించేశారు. మహేష్ బాబు మాస్ ఫాలోయింగ్ వున్న స్టార్. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మహేష్ బలం. ఇప్పటివరకూ మహేష్ ఎంత మాస్ సినిమా చేసిన సీన్లు డైలాగులు విషయంలో ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా చూసుకునేవాడు. కానీ సర్కారు విషయానికి వచ్చేసరికి ఊరమాస్ దాటి డైలాగులు వినిపించారు. ట్రైలర్ లో ఇన్ని నాటు డైలాగులు వినిపిస్తే సినిమా ఎలా వుంటుందో.,. ఇలాంటి సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళడం అవసరమా ? అనే చర్చ అప్పడే మొదలైయింది.
దర్శకుడు పరశురాం మంచి స్పార్క్ వున్న రైటర్. మాస్ ని మెప్పించే డైలాగులు పేల్చగలడు. మాస్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చేసరికి మాత్రం అతని డైలాగులు డబుల్ మీనింగ్ తీసుకుంటాయి. ఆంజనేయులు సినిమా యూట్యూబ్ లో చుసినట్లు టీవీలో చూడలేరు. కారణం.. పరశురాం రాసిన డబుల్ మీనింగ్ ఊరనాటు 'ఏ' సర్టిఫికేట్ డైలాగులు. ఆ సినిమా తర్వాత అలాంటి మాటలు రాయకూడదని ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన పరశురాం.. మహేష్ సినిమా కోసం మళ్ళీ ఆ రూటులోనే వెళ్ళిపోయాడు. వయాగ్రా, శోభనం, ఇంత పొడుగు.. ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఇబ్బంది పడే డైలాగులే. ఎంత మాస్ సినిమా అయినా మహేష్ కి ఇలాంటి 'ఏ' సర్టిఫికేట్ డైలాగులు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.