ఇటీవల కాలంలో ఓటీటీ హవా ఎక్కువైపోయింది. కరోనా, లాక్ డౌన్ వేళల్లో.. థియేటర్లకు అసలు సిసలు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ఎదిగింది. పెద్ద సినిమాలూ ఓటీటీలపైపు దృష్టి పెట్టాయి. థియేటరికల్ రిలీజ్ కోసం ఎదురు చూసిన `నారప్ప`లాంటి చిత్రాలు... చివరికి ఓటీటీ బాట పట్టాయి. ఓటీటీలో విడుదల చేయడం వల్ల ఆయా చిత్రాలకు మేలే జరిగింది. ఓటీటీలు కూడా పెద్ద సినిమాల్ని లాక్కోవాలని, తమ వ్యూవర్ షిప్ ని పెంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నాయి. అందుకోసం ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యాయి.
తాజాగా ఓటీటీల దృష్టి `సర్కారు వారి పాట`పై పడింది. మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. సంక్రాంతికి విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ కూడా చిత్రబృందం ప్రకటించేసింది. అయినా సరే, ఓటీటీ సంస్థలు ఈ సినిమాని లాగేయాలని చూస్తున్నాయి. తాజాగా హాట్ స్టార్ ఓ ఫ్యాన్సీ ఆఫర్ ని `సర్కారు వారి పాట` ముందు పెట్టాయని తెలుస్తోంది. ఆ ఆఫర్ చాలా టెమ్టింగ్ గా ఉందని టాక్. సంక్రాంతి నాటికి థర్డ్ వేవ్ భయాలేం లేకపోతే.. ఈ సినిమా థియేటర్లలోనే వస్తుందని, ఆ సమయంలో థియేటర్లు మూతబడి, విడుదల చేయలేని పరిస్థితిలో ఉంటే, చెప్పిన సమయానికే.. ఓటీటీలో విడుదల అవుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మున్ముందు సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి.