రాజమౌళి ఏం చేసినా భారీగా ఉంటుంది. ఆయన ఆలోచనలు, కథలు, ఊహలు, పాత్రలు.. అన్నీ భారీదనం తో నిండుకున్నవే. `ఆర్.ఆర్.ఆర్` కూడా భారీ ప్రాజెక్టే. దాదాపు రూ.350 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాలోని `దోస్తీ` పాటపై విడుదలకు ముందే చర్చ జరిగింది. టాలీవుడ్ లోనే కాదు, దక్షిణాదినే అత్యంత ఖరీదైన పాట ఇదని, ఈ పాట కోసం రాజమౌళి దాదాపు ఏడెనిమిది కోట్లు కేటాయించడాని అన్నారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా `దోస్తీ` పాట కూడా విడుదలైంది.
పాటని తెరకెక్కించిన తీరు, ఆ పాట సాగిన విధానం, బాణీ, పదాలు... అన్నీ బాగున్నాయి. అయితే ఇదే అత్యంత ఖరీదైన పాట అంటే నమ్మేలా లేదు. ఈ పాట కోసం 2 కోట్లు ఖర్చు చేసినా ఎక్కువే అంటున్నారంతా. మరి.. ఆ టాక్ ఎలా బయటకు వచ్చిందో? అయితే.. ఇప్పుడు మరో మాట వినిపిస్తోంది. `దోస్తీ`కి రెండో వెర్షన్ ఉందని, దాన్ని సినిమాలోనే చూపిస్తారని, ఆ పాటలో చిత్రబృందం అంతా కలిసి ఆడి పాడుతుందని... అందుకే ఈ పాటకు అంత ఖర్చు పెట్టారని అంటున్నారు. మరి ఇదైనా నిజమేనా? లేదంటే కేవలం ప్రచారం కోసం ఆ గాసిప్ పుట్టించారా? అన్నది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.