'అపరితుడు' సినిమాలో హీరో రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు. దర్శకుడు శంకర్ ఆ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కిస్తే, అంతకంటే అద్భుతంగా నటించి మెప్పించాడు హీరో విక్రమ్. పలు సినిమాల్లో ఇలాంటి పాత్రల్ని చూశాం, చూస్తూనే వున్నాం. వాటన్నిటిలోకీ భిన్నంగా వుంటుందట 'సవ్యసాచి'లోని నాగచైతన్య పాత్ర.
ఇద్దరు వ్యక్తులు, ఒకటే శరీరం.. అమ్మ కడుపులో కవలలుగా వున్నప్పుడే ఈ అద్భుతం జరుగుతుంది. మామూలుగా సవ్యసాచి అంటే, రెండు చేతులతోనూ బాణాలు సంధించగల నేర్పరి అని అర్థం. కానీ, ఈ 'సవ్యసాచి' కథ వేరు. ఒక్కడే కాని ఇద్దరు, ఇద్దరే కానీ, ఒక్కడు.. అంటూ తాజాగా విడుదలైన పాట 'సవ్యసాచి'పై అంచనాల్ని పెంచేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. నాగచైతన్య వరకూ ఇది చాలా ప్రయోగాత్మక చిత్రంగానే చెప్పుకోవాలి. ఆ మాటకొస్తే, ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై ఇంతకు ముందెప్పుడూ సినిమా వచ్చిన దాఖలాల్లేవు.
కథ, కథనం అన్నీ గ్రిప్పింగ్‌గా వుండబోతున్నాయనీ, తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కల్పిస్తామనీ చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇంతకీ, 'సవ్యసాచి' కథేంటి.? ఆ సినిమా సత్తా ఏంటి.? తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే. ఈలోగా మరి అభిమానుల అంచనాలెలా వుంటాయి.? ఆల్రెడీ అంచనాలో ఓ రేంజ్‌కి వెళ్ళిపోయాయి.
సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే ఆలస్యం.