'సినిమాని వ్యతిరేకించండి, ప్రశ్నించండి, అవసరమనుకుంటే కోర్టుకు వెళ్ళండి. అంతేగానీ, విధ్వంసాలకు దిగొద్దు' అని 'పద్మావత్' టీమ్ విజ్ఞప్తి చేస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో 'పద్మావత్' సినిమాకి వ్యతిరేకంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. ఆందోళనకారులు ఒళ్ళు మరిచిపోయి విధ్వంసాలకు దిగుతున్నారు.
ఓ బస్‌పై ఆందోళనకారులు దాడి చేయడంతో, అందులోని చిన్నారులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలరచేతపట్టుకున్న ఘటన వెలుగు చూసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో 'పద్మావత్' టీమ్ సభ్యులు, ఇలాంటి దారుణాల్ని ప్రభుత్వాలు నియంత్రించలేకపోవడం శోచనీయమని విమర్శించారు. 'పద్మావత్' ఓ మంచి సినిమా అనీ, నిరసనకారుల అభ్యంతరాలతో సినిమాలోని కంటెంట్‌ని కొంతవరకు తొలగించి, సినిమాని సెన్సార్‌కి పంపించామనీ, సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ విధ్వంసాలు దురదృష్టకరమని వారంటున్నారు.
హీరోయిన్ దీపికా పడుకొనే, ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన షాహిద్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ 'పద్మావత్' ఆందోళనలపై పెదవి విప్పారు. ఓ మంచి సినిమా అవుతుందనే ఆశతో, ఎంతో కష్టపడ్డామనీ, తమ కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుందని భావిస్తే, ఈ సినిమా మీద ఇంత విషప్రచారం చేసి తమకు మానసిక క్షోభను మిగిల్చారనీ, 'పద్మావత్'పై ఎంత దాడి జరిగినా తట్టుకున్నామనీ, అయితే ఆ సినిమా పేరుతో విధ్వంసాలు చాలా బాధ కలిగిస్తున్నాయని అన్నారు.
సినిమాలకి వివాదాలు కొత్త కాదు. అయితే కనీ వినీ ఎరుగని స్థాయిలో 'పద్మావత్' సినిమా చుట్టూ వివాదాలు మురుసురుకున్నాయి. ఆ వివాదాలు సైతం ఊహలకందని విధ్వంసాన్ని మిగుల్చుతున్నాయి. ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. సినిమా వచ్చాక అయినా వివాదాలు చల్లారతాయా? వేచి చూడాలిక.