బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ ఆత్మహత్యకు దేవరాజ్ రెడ్డి అనే టిక్ టాక్ స్టార్ వేధింపులే కారణం అంటూ... ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన ఆడియో టేపులు కూడా విడుదలయ్యాయి. `ఓ గంట సేపు నాతో గడుపు` అంటూ ఫోన్లోనే శ్రావణిని బెదిరించిన వైనం బయటకు వచ్చింది. దాంతో.. దేవరాజ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఆ తరవాత.. దేవరాజ్ ఓ సెల్ఫీ వీడియోని విడుదల చేశాడు. తన దగ్గర ఉన్న ఆడియో టేపుల్ని కూడా బయట పెట్టాడు. అందులో శ్రావణి - దేవరాజ్ ప్రేమించుకున్నట్టు, శ్రావణి ఇంట్లో వాళ్ల వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు స్పష్టం అవుతోంది.
`నా ఆత్మహత్యకు నువ్వు కారణం కాదు` అని శ్రావణి చెప్పిన సంగతి ఆ కాల్ రికార్డ్ ద్వారా బయటకు వచ్చింది. ఈ ఉదంతంలో సాయి అనే మరో వ్యక్తి పేరు బయటకు వచ్చింది. సాయి వేధింపుల వల్లే... శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ అంటున్నాడు. తానెక్కడికీ పారిపోలేదని, పోలీసులకు లొంగిపోతానని, నిజానిజాలు బయట పెడతానని అంటున్నాడు దేవరాజ్. మరోవైపు సాయి కూడా.. ఈ ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ ఓ వీడియో విడుదల చేయడం విశేషం.