వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా `ఐకాన్` అనే సినిమాని ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఓ ఖరీదైన బైక్‌పై బన్నీ దూసుకెళ్తున్న ఓ ఫొటోని ఫస్ట్ లుక్ గానూ వదిలారు. అయితే... ఆదిలోనే హంస పాదు అన్నట్టు... ఆ ప్రాజెక్టుకు ముందే బ్రేక్ పడిపోయింది. అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తరవాత.. వేణు శ్రీరామ్ `వకీల్ సాబ్` పనిలో పడ్డాడు. బన్నీ `అల వైకుంఠపురములో` చేసుకుని `పుష్ష`తో బిజీ అయిపోయాడు. దాంతో `ఐకాన్` ఆగిపోయింది. ఈ సినిమా ఇక లేదని, ఉన్నా.. దాన్ని బన్నీ చేయడని వార్తలొచ్చాయి. ఈ సినిమా కోసం మరో హీరోని వెదుకుతున్నారని చెప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు బన్నీ చేతుల్లోనే ఉందట. ఇప్పుడు కాకపోయినా, కాస్త ఆలస్యం అయినా ఈ కథలో బన్నీనే కనిపిస్తాడట. ఈ విషయంలో వేణు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చేశాడు.
''ఐకాన్ కథ బన్నీకి బాగా నచ్చింది. కలిసి చేద్దాం అనుకున్నాం. కానీ.. మధ్యలో వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అవ్వడం వల్ల ఆలస్యం అయ్యింది. ఎప్పటికైనా ఈ కథని బన్నీతోనే చేస్తా. తాను కూడా ఆసక్తిగా ఉన్నాడు'' అని చెప్పుకొచ్చాడు వేణు శ్రీరామ్.