అతిలోక సుందిర శ్రీదేవి బాగా తలపుకు వస్తోంది. ఎందుకంటే ఆమె చివరిగా నటించిన చిత్రం 'జీరో' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్లామర్ తారగా తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో ఓ వెలుగు వెలిగిన అతిలోక సుందరి అనుమానాస్పద స్థితిలో కొన్ని నెలల క్రితం ప్రేక్షక లోకాన్ని వీడి వెళ్లిపోయింది. అదంతా ఓ మాయలా జరిగిపోయింది. అందరి మధ్య నుండీ ఈ దేవకన్య అమాంతం మాయమైపోయింది. అయినా అతిలోకసుందరిగా అందరి హృదయాల్లోనూ శ్రీదేవి జీవించే ఉంటుంది.
ఇకపోతే 'జీరో' విషయానికి వస్తే షారూఖ్‌ఖాన్ మరుగుజ్జు పాత్రలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో శ్రీదేవి గెస్ట్ రోల్‌లో నటించారు. అయితే ఆ పాత్రేంటో ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచుతున్నారు చిత్ర యూనిట్. 'జీరో' సినిమాలో శ్రీదేవి నటించిన మాట వాస్తవమే కానీ, ఆ పాత్రను సినిమా చూసేంత వరకూ సస్పెన్స్‌గానే ఉంచాలనుకుంటున్నామని షారూఖ్ అన్నారు. శ్రీదేవి బతికుంటే మొట్ట మొదటగా ఈ సినిమాని ఆమెకే చూపించేవాడ్ని అంటూ శ్రీదేవితో గడిపిన క్షణాల్ని షారూఖ్ తలచుకున్నారు.
1996లో శ్రీదేవితో 'ఆర్మీ' చిత్రంలో షారూఖ్‌ఖాన్ నటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆమెతో స్క్రీన్ పంచుకున్నారు. ఆమె జీవించి ఉంటే మరెన్నో చిత్రాల్లో నటించి ఉండేవారు. 'జీరో'లో శ్రీదేవితో పాటు కండలవీరుడు సల్మాన్‌ఖాన్ కూడా అతిధి పాత్రలో మెరవగా, షారూఖ్‌కి జోడీగా అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు.