నటీనటులు: సమంత,దేవ్ మోహన్, మోహన్ బాబు
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత : నీలిమ గుణ, దిల్ రాజు
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
కథల కోసం శ్రమపడి వెదుక్కోవాల్సిన అవసరం లేదు. మన పురాణాలు, ఇతిహాసాలు చూస్తే.. బోలెడన్ని కథలు కనిపిస్తాయి. వాటిని అటూ ఇటూ మార్చి, సినిమాటిక్ గా మలిస్తే.. ఓ కొత్త కథ తయారైపోతుంది. లేదూ... ఇతిహాసాన్నే సినిమా కథగా చెబుతానన్నా ఓకే. ఇక్కడ ఓ సౌలభ్యం ఉంటుంది. కథ గురించి ఎవరూ కంప్లైంట్ చేయరు. పాత కథ అనరు. తెలిసిన కథే.. కొత్తగా చూస్తారు. పైగా ఇతిహాసాల జోలికి వెళ్తే.. విజువల్ వండర్ గా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యాన్ని గుణశేఖర్ వెండి తెరపై ఆవిష్కరించాలన్న ఆలోచన వచ్చి ఉంటుంది. సమంతని కథానాయికగా ఎంచుకోవడం, త్రీడీ ఎఫెక్టులో తెరకెక్కించడం, భారీ విజువల్ హంగులు జోడించడంతో... `శాకుతలం`పై అందరి కన్నూ పడింది. మరి... కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంని.. గుణశేర్ వెండి తెరపై ఏ మేరకు రక్తి కట్టించాడు? త్రీడీ ఎఫెక్టులలో సినిమా ఎలా ఉంది? సమంత ఎలా చేసింది?
కథ:
శాకుంతలం కథ.. అందరికీ తెలిసిందే. మళ్లీ మరోసారి చెప్పుకొంటే - విశ్వామిత్రుడి తపస్సు భంగం కలిగించడానికి స్వర్గం నుంచి మేనక భువిపైకి వస్తుంది. మేనకని చూసిన విశ్వామిత్రుడు వశం తప్పుతాడు. విశ్వామిత్రుడు, మేనక ఒక్కటవుతారు. ప్రతిఫలంగా ఓ బిడ్డ జన్మిస్తుంది. నరులకు స్వర్గ లోక ప్రవేశం లేదు కాబట్టి.. ఆ బిడ్డని భూమ్మీదే వదిలేసి స్వర్గానినికి వెళ్లిపోతుంది మేనక. అలా వదిలేసిన బిడ్డ.. కన్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల పేరుతో పెరిగి పెద్దదవుతుంది. ఓరోజు హస్తిన పురి రారాజు దుష్యంతుడు (దేవ్ మోహన్) కన్వాశ్రమానికి వస్తాడు. అక్కడ శకుంతలని చూసి ప్రేమిస్తాడు. తనని గాంధర్వ వివాహం చేసుకొంటాడు. శారీరకంగానూ ఒక్కటవుతారు. ఓ ఉంగరం గుర్తుగా ఇచ్చి, త్వరలోనే తాను మేళతాళాలతో వచ్చి, తీసుకెళ్తానని శకుంతలకు మాట ఇస్తాడు. శకుంతల గర్భవతి అవుతుంది. ఎంతకీ రాని... దుష్యంతుడ్ని వెదుక్కొంటూ హస్తినకు వెళ్తుంది. కానీ.. శకుంతలని దుష్యంతుడు గుర్తు పట్టడు. ఎవరు నువ్వు? అని నిలదీస్తాడు. ఆ అవమాన భారం భరించలేక.. హిమాలయాలకు వెళ్లిపోతుంది శకుంతల. అక్కడే ఓ బిడ్డకు జన్మనిస్తుంది. తాను చేసిన తప్పు తెలుసుకొన్న దుష్యంతుడు... శకుంతలని కలిసి, క్షమాపణలు అడగడంతో కథ ముగుస్తుంది.
విశ్లేషణ:
కాళిదాసు రాసిన మేటి కావ్యాల్లో అభిజ్ఞాన శాకుంతలం ఒకటి. దీనికి శృంగార కావ్యంగా పేరు. కానీ.. ఈ కావ్యంలో శ్రుంగారం మాత్రమే కాదు. అన్ని కోణాలూ ఉంటాయి. ఓ స్త్రీ ఆత్మగౌరవానికి.... శకుంతల పాత్ర ప్రతీకగా నిలుస్తుంది. ప్రేమ, విరహం, ఓ తల్లి పడే ఆవేదన అన్నీ ఉంటాయి. అవన్నీ నచ్చే గుణశేఖర్ ఈ కథని వెండి తెరపైకి తీసుకుని రావాలనుకొన్నాడేమో..? ఈ కథని వీలైనంత విజువల్ వండర్ గా చూపించాలని దర్శకుడు తాపత్రయపడ్డాడు. కన్వ మహర్షి ఆశ్రమం దగ్గర్నుంచి... హస్తిన కోట వరకూ ప్రతీ ఫ్రేమూ రంగుల హరివిల్లులా చూపించాడు. పులితో పోరాటం, మదపు ఏనుగుని దుష్యంతుడు ఎదిరించడం, యుద్ధ సన్నివేశాలు... ఇలా విజువల్ ఇంపాక్ట్ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నించాడు. శకుంతల - దుష్యంతులు కలుసుకొనే తొలి సన్నివేశం రంగుల హరివిల్లులా ఉంటుంది.
శాకుంతలం కథ.. అందరికీ తెలిసిందే. ఇక్కడ దర్శకుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం తప్ప. చరిత్రని వక్రీకరించకుండా, పురాణాల్ని, ఇతిహాసాల్ని పక్క దోవ పట్టించకుండా వీలైనంత మాతృకకు కట్టుబడే శకుంతల చిత్రాల్ని రూపొందించాడు దర్శకుడు. కాకపోతే... ఎమోషన్ ని మాత్రం పట్టలేకపోయాడేమో అనిపిస్తుంది. శకుంతల పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వకుండానే, అసలు కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. దాంతో శకుంతల కోణం నుంచి చూడాల్సిన సినిమాని దుష్యంతుడి కోణంలో చూడడం మొదలెడతాడు ప్రేక్షకుడు. శకుంతల బాధని, విరహాన్ని.. ప్రేక్షకుడు ఫీల్ అయ్యే ఛాన్స్ దక్కలేదు. యుద్ధ సన్నివేశాలు బాగానే ఉన్నా.. అంత ఇంపాక్ట్ కలిగించవు. ఎందుకంటే బాహుబలిలో ఇంతకంటే భారీ యుద్ధాల్ని చూసేశాం. వాటితో పోల్చుకొంటే అవన్నీ తేలిపోతాయి. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నా.. లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అల్లు అర్హ కోసం పతాక సన్నివేశాల్ని కావాలని సాగదీశారు. దుర్వాస మహర్షి శాపం.. ఈకథలో కీలకమైన ఎపిసోడ్. దాన్ని సైతం.. ప్రభావవంతంగా తీయలేకపోయారు. తన తప్పు తెలుసుకొని దుష్యంతుడు కుమిలిపోయే సన్నివేశం కూడా హృదయాల్ని తాకదు. ఇలా.. అక్కడక్కడ ఎమోషన్ పట్టుకొంటూ, చాలా చోట్ల వదిలేస్తూ.. కొన్ని చోట్ల విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ, ఇంకొన్ని చోట్ల తేలిపోతూ.. అపరిపక్వమైన వంటకంలా తయారైంది శాకుంతలం.
నటీనటులు:
శకుంతల పాత్రలో సమంత కనిపించడం వల్ల.. ఈ సినిమాకి స్టార్ డమ్ వచ్చింది. ఆ పాత్రలో సమంత ఇమిడిపోయింది కూడా. కాకపోతే.. శకుంతల పాత్రని ఇంకాస్త బాగా డిజైన్ చేయాల్సింది. తనని కావాలని బంధీని చేశారేమో అనిపిస్తుంది. చాలా చోట్ల సమంత ఓపెన్ అవ్వలేదు. దాదాపు ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. దేవ్ మోహన్ చూడ్డానికి బాగున్నాడు. కానీ... ఎక్స్‌ప్రెషన్స్ లేవు. దుష్యంతుడికి కావల్సినదానికంటే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అలాంటప్పుడు తెలుగు తెరకు పరిచమైన నటుడ్ని తీసుకోవాల్సింది. మోహన్ బాబు కనిపించింది ఒక్క సన్నివేశంలోనే. కాకపోతే.. మోహన్ బాబు వల్ల.. ఆ సీన్ కాస్త పండింది. గౌతమి, మధుబాల చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.
సాంకేతిక వర్గం:
సీజీలకు ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. గ్రాఫిక్స్ చాలా చోట్ల బాగున్నాయి. కొన్ని చోట్ల తేలిపోయాయి. గ్రీన్ మ్యాట్ కి ఎక్కువ పని పడింది. పతాక సన్నివేశాల్లో వార్ ఎపిసోడ్స్ పేలవంగా ఉన్నాయి. మణిశర్మ సంగీతం.. రొటీన్ తరహాలోనే సాగింది. పాటలూ ఆకట్టుకోవు. విజువల్ ఇంపాక్ట్ పై దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. ఎమోషన్లని మాత్రం పట్టుకోలేకపోయాడు. దాంతో.. గుణశేఖర్ ప్రయత్నం అనుకొన్న స్థాయిలో నెరవేరలేకపోయింది. కాకపోతే.. అభిజ్ఞాన శాకుంతలం కథని ఈతరానికి తెలిసేలా చెప్పడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్:
విజువల్స్
సమంత
మైనస్ పాయింట్స్:
ఎమోషన్ పట్టుకోలేకపోవడం
స్లో నేరేషన్
ఫైనల్ వర్డిక్ట్: సమంత కోసమే!