ఎందుకో శంకర్ ప్లానింగులు ఈమధ్య బాగా తేడా కొట్టేస్తున్నాయి. కమల్ హాసన్‌తో ప్లాన్ చేసిన `భారతీయుడు 2` నత్తనడక నడుస్తోంది. దానికి రకరకాల కారణాలున్నాయి. భారతీయుడు 2 వల్ల.. చరణ్ సినిమాని అనుకొన్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నాడు. మరోవైపు రణవీర్ సింగ్ `అపరిచితుడు`ని హిందీలో రీమేక్ చేస్తానని ప్రకటించి దాదాపు యేడాది అయ్యింది. కానీ అప్పటి నుంచీ ఎలాంటి అప్ డేటూ లేదు. చరణ్ సినిమా పూర్తవ్వాలి, భారతీయుడు 2 అవ్వాలి... అప్పుడు రణవీర్ సింగ్ సినిమా మొదలవుతుంది.
అయితే.. ఇప్పుడు `అపరిచితుడు` రీమేక్ ని శంకర్ పక్కన పెట్టేశాడని టాక్. ఈ ఐడియా అవుడ్డేటెడ్ అయిపోయింది శంకర్ భావిస్తున్నాడట. అయితే రణవీర్ సింగ్ తో మాత్రం సినిమా ఉంటుంది. అది అపరిచితుడు కంటే.. ఇంకా పెద్ద ప్రాజెక్టు శంకర్ మైండ్ లో ఉందని సమాచారం. సుప్రసిద్ధమైన తమిళ నవల `వేల్పారి` హక్కుల్ని ఇటీవల శంకర్ చేజిక్కించుకొన్నారు. ఇప్పుడు ఆ నవలని వెండి తెరపైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడట శంకర్. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు టాక్. విజువల్ పరంగా ఈ సినిమా బాహుబలి, ఆర్.ఆర్.ఆర్‌ని మించిపోయేలా ఉండబోతోందని టాక్. బడ్జెట్ కూడా దాదాపుగా రూ.1000 కోట్ల వరకూ అవ్వబోతోందట. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఈ చిత్రాన్ని ఓ మైలు రాయిగా నిలబెట్టాలన్నది శంకర్ తాపత్రయం. అందుకు తగిన సన్నాహాలు కూడా మొదలెట్టేశాడట. చూస్తుంటే... బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ రికార్డుల్ని తలదన్నేలా ఓ సినిమా చేయాలని శంకర్ ఫిక్సయిపోయినట్టే కనిపిస్తోంది. ఏం చేస్తాడో చూడాలి.