బాలకృష్ణ మంచి స్వింగులో ఉన్నాడు. ఓ వైపు... రియాలిటీ షోలు, మరో వైపు కమర్షియల్ యాడ్లు... ఇంకోవైపు సినిమాలూ.. ఇలా ఒక్క క్షణం తీరిక లేదు. అఖండతో బాలయ్య మైలేజీ మరింత పెరిగింది. అయితే ఎప్పటిలా... కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో వెనుకంజ వేయడం లేదు. ప్రయోగాలు చేయడానికీ భయపడడం లేదు. ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో, ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.
కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో ఆకట్టుకొన్నాడు వెంకటేష్ మహా. ఇప్పుడు బాలయ్య కోసం ఓ కథ రెడీ చేశాడట. కంచరపాలెంలానే... ఇది కూడా ప్రయోగాత్మక చిత్రమే అని సమాచారం. ఇందులో నటించడానికి బాలయ్య ఓకే అనేశాడట. దీన్ని ఓ ఎక్స్‌పరమెంటల్ సినిమాగా తీయాలని, అందుకోసం తాను పారితోషికం తగ్గించుకొంటానని బాలయ్య హామీ ఇచ్చాడట. అయితే ఈ సినిమా ఈ యేడాది పట్టాలెక్కే అవకాశం లేదు. ఎందుకంటే.. వీర సింహారెడ్డి అవ్వగానే, అనిల్ రావిపూడితో ఓ సినిమా మొదలెడతాడు బాలయ్య. ఆ తరవాతే... వెంకటేష్ మహాతో సినిమా ఉంటుంది. గీతా ఆర్ట్స్ లో బాలయ్య ఓ సినిమా చేయాల్సివుంది. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్టు గీతా ఆర్ట్స్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది.