ఇటీవల స్టార్ హీరోల ఆరోగ్య పరిస్థితి అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. కమల్ హాసన్, ఉపేంద్ర లాంటి స్టార్ హీరోలు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. వారిద్దరూకోలుకొని మళ్లీ యధావిధిగా షూటింగులు మొదలెట్టారు. ఇప్పుడు మరో హీరో కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సివచ్చింది. ఆయనే శరత్ కుమార్.
తమిళంలో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చి, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన శరత్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన డయేరియాతో బాధ పడుతున్నట్టు, డీ హైడ్రేషన్‌కి గురైనట్టు తెలుస్తోంది. ప్రత్యేక వైద్య బృందం శరత్ కుమార్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు.
అయితే అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. శరత్ కుమార్ ఇటీవల కరోనా బారీన పడ్డారు. కరోనా నుంచి కోలుకొన్నా - ఇతర ఆరోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముట్టాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.