చిన్న హీరో అయినా కానీ పెద్ద హీరోలతో పోటీలో ఏమాత్రం తగ్గడం లేదు శర్వానంద్. ఈ యంగ్ హీరోకి సంక్రాంతి బాగా కలిసొస్తుంది. గతేడాది 'ఎక్స్‌ప్రెస్ రాజా'లా దూసుకొచ్చి, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలకు పోటీగా బరిలో దిగాడు. సక్సెస్ అయ్యాడు. ఈ ఏడాది కూడా ఏది ఏమైనా సంక్రాంతికే వస్తానంటూ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కూడా పోటీ పడ్డాడు. రెండు పెద్ద సినిమాలైన 'ఖైదీ', శాతకర్ణి' సినిమాలతో పోటీపడి తన స్థానాన్ని బాగానే నిలబెట్టుకున్నాడు. 'శతమానం భవతి' అంటూ దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా కూడా సంక్రాంతికి భారీగానే వసూళ్లు తెచ్చిపెట్టింది. తొలిరోజు ఈ సినిమా సాధించిన వసూళ్లు 3 కోట్లు. అయితే ప్రస్తుతం చిరంజీవి, బాలయ్య సినిమాల వసూళ్ల ప్రభంజనంలో ఈ లెక్క ఏ పాటిది అనుకుంటూ తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇంత గట్టి పోటీలో కూడా శర్వానంద్ సినిమా నిలబడిందంటే గొప్ప విషయమే అంటున్నారు సినీ ప్రముఖులు. పల్లెటూరి వాతావరణంలో ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ని టచ్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఈ స్థాయిలో రావడమన్నది శుభపరిణామమే. అలాగే సంక్రాంతి పండగ అంటే తెలీని పట్టణ వాసులకు ఈ సినిమా ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యింది ఈ పండగ పూట. శర్వానంద్ నటన, అనుపమా అందాలు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.