హిట్స్ మీద హిట్స్ కొడుతూ గత రెండేళ్లుగా డబుల్ హ్యాట్రిక్ హీరో అనిపించుకుంటున్న నాని రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేశాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అవును మరి, యంగ్ హీరోస్లో నానికి ఉన్న క్రేజ్ అలాంటిదిప్పుడు. అయితే ఇదే గాసిప్ ఇప్పుడు ఫెస్టివల్ హీరో శర్వానంద్ విషయంలో కూడా చక్కర్లు కొడుతోంది. యంగ్ హీరోస్లో నాని తర్వాత హిట్ ఫ్రేమ్ ఉన్న హీరో శర్వానంద్. ముఖ్యంగా ఫెస్టివల్స్‌లో శర్వానంద్ సినిమా అంటే గ్యారంటీ హిట్ అనే బ్రాండ్ ఉంది. దాంతో శర్వానంద్ కూడా రెమ్యునరేషన్ పెంచేశాడంటూ గాసిప్స్ వస్తున్నాయి. అయితే శర్వా అలాంటోడు కాదు.
రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడూ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడు అని సినీ జనాలు అంటున్నారు. ఆ విషయంలో అంత మంచి పేరుంది శర్వానంద్‌కి. అయితే సక్సెస్ వస్తున్నాయి కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో కొంచెం ఎక్కువగా ఆలోచిస్తే తప్పేముంది? అంటున్నారు మరికొంత మంది. అయినా కానీ ఒక్క సినిమా సక్సెస్ వస్తేనే రెమ్యునరేషన్ పెరగడం అనేది హీరోలు, హీరోయిన్స్ విషయంలో సర్వ సాధారణమైన అంశం. అలాంటిది ఒకవేళ ఈ గాసిప్ శర్వానంద్ విషయంలో నిజమైనా కావచ్చు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు శర్వానంద్. గతేడాది 'మహానుభావుడు' సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సుధీర్ వర్మతో శర్వానంద్ చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు.