శేఖర్ కమ్ముల స్టైల్ తెలియంది కాదు. ఆయనకు ఏది నచ్చితే, ఎలా నచ్చితే అలా ఉంటారు, తీస్తారు. స్టార్ల వెంట ఎప్పుడూ పరుగులు పెట్టలేదు. యేడాదికి ఒక్క సినిమా అయినా తీసేయాలి అని లెక్కలు వేసుకోలేదు. అందుకే ఆయన సినిమా మొదలెట్టేదీ - పూర్తయ్యేది... అంతా పంచ వర్ష ప్రణాళికలా సుదీర్ఘంగా అనిపిస్తుంది. నాగచైతన్య - సాయిపల్లవిలతో ఆయన ``లవ్ స్టోరీ`` రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కావాల్సింది. ఆ తరవాత ఏప్రిల్ 14న వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ లోనూ విడుదల కావడం లేదట. మే చివరి వారంలో ఈ సినిమాని తీసుకొస్తారని తెలుస్తోంది. మే 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.
ఈనెలాఖరుకి షూటింగ్ పూర్తవుతుందని, ఏప్రిల్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయని, మేలో పబ్లిసిటీ మొదలెట్టి, చివరి వారంలో విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు కూడా గట్టిగా చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఎలాంటి కంగారూ లేకుండా నిదానంగా ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. అందుకే... ఇంత స్లో అవుతోంది.