ఇదివరకట్లో హీరోయిన్లు భాషపై ఎక్కువ కాన్‌సనేట్రేషన్ చేసే వారు కాదు. కానీ కాలం మారింది. ఆలోచనలూ మారాయి. నటనపై డెడికేషన్ పెరిగింది. ఏదో సిట్యువేషన్‌కి తగ్గట్లుగా డైరెక్టర్ చెప్పిన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేశామా అన్నట్లుగా కాకుండా, నేటి తరం హీరోయిన్లు భాషను అర్ధం చేసుకుని ప్రతీ సన్నివేశాన్ని అర్ధం చేసుకుని నటించడానికి ఇష్టపడుతున్నారు. ఆ రకంగా ఇతర భాషల నుండి తెలుగులోకి తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మలు తెలుగు భాషపై పట్టు సాధిస్తున్నారు. ఎంతో ఇష్టంగా తెలుగు భాషని నేర్చుకుంటున్నారు. ఆ కారణంగా సినిమాలోని ప్రతీ సన్నివేశం నేచురల్‌గా తెరకెక్కడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ముద్దుగుమ్మలు తెలుగమ్మాయిల్లాగే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ఇటీవల విడుదలైన 'ఫిదా' సినిమాతో సాయి పల్లవి అచ్చమైన తెలంగాణా యాసతో సొంతంగా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుని ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. అలాగే అందరు ముద్దుగుమ్మలు డబ్బింగ్ చెప్పుకోలేకపోయినప్పటికీ, భాషని అర్ధం చేసుకుని నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా సునీల్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఉంగరాల రాంబాబు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న ముద్దుగుమ్మ మియా జార్జ్ కూడా తెలుగు భాషపై పట్టు సాధించింది. త్వరలోనే తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకునేంతగా నేర్చుకుంటాననీ చెబుతోంది. ఇకపోతే 'సాహో' సినిమాతో ఎంట్రీ ఇస్తోన్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రత్యేకించి తెలుగు పండిట్‌ని నియమించుకుని మరీ తెలుగు నేర్చేసుకుంటోందీ బ్యూటీ.