నాని హీరోగా తెరకెక్కుతోన్న 'జెర్సీ' సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెల్సిందే. క్రికెట్ నేపథ్యంలో సాగే ఓ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని అభివర్ణించొచ్చు. ట్రైలర్‌ని చూస్తే అదే భావన కలుగుతోంది అందరికీ. నటిగా తొలి సినిమాతోనే కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకునేలా వుంది.
టాలెంట్ సంగతి పక్కన పెడితే, శ్రద్ధా శ్రీనాథ్ చాలా విషయాల్లో చేస్తోన్న 'అతి' ఆమెను వివాదాల్లోకి లాగుతోంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'యూ టర్న్' సినిమాని తొలుత కన్నడలో చేసింది శ్రద్ధా శ్రీనాథ్. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, తాను తెలుగు వెర్షన్ 'యూ టర్న్'ని చూడలేకపోయాననీ, తన పాత్రలో సమంతని ఊహించుకోలేకపోయానని చెప్పి తీవ్రంగా ట్రాలింగ్ ఎదుర్కొంది. తాజాగా, నిన్న 'జెర్సీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ని మర్చిపోయింది. ఈ వేడుకకి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గనుక, ఆయన గురించి తొలుత ప్రస్తావించి వుండాల్సింది. నిర్మాత సహా పలువురు శ్రద్ధా శ్రీనాథ్‌కి వార్నింగ్ ఇవ్వడంతో, ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా స్టేజ్ మీదకు వచ్చి వెంకటేష్ గురించి రెండు ముక్కలు చెప్పి వెళ్ళింది శ్రద్ధా శ్రీనాథ్.
'నా పేరు గుర్తుంచుకోండి.. ఎందుకంటే ఈ సినిమాతో నటిగా నాకు చాలా గుర్తింపు రాబోతోంది..' అని పదే పదే శ్రద్ధా శ్రీనాథ్ చెప్పిన మాటలు 'ఓవర్ ఆటిట్యూడ్'ని తెలియజేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.