నానితో ‘జెర్సీ’ సినిమాలో నటించిన కన్నడ కుట్టీ శ్రద్ధా శ్రీనాధ్ గుర్తుంది కదా. ఎందుకు మర్చిపోతారులే.. ఆ సినిమా ప్రమోషన్స్‌లో తనను తాను పేరుతో సహా ఏ రేంజ్లో ప్రమోట్ చేసుకుందో అందరికి తెలిసిందే. సో మర్చిపోయే ఛాన్సే లేదు. ప్రస్తుతం ఈ భామ తమిళంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే, మార్చిలో షూటింగ్స్ నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చిన కారణంగా ఈమెకు కరోనా సోకిందనీ, 14 రోజులు క్వారంటైన్లో చికిత్స పొందుతోందనీ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే, ఆ వార్తల్ని శ్రద్ధా ఖండించింది. తనకు కరోనా సోకిందన్న వార్తల్లో నిజం లేదు కానీ, విదేశాలకు వెళ్లి రావడం నిజమే. కానీ, సామాజిక బాధ్యతతో, తన ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాననీ, 14 రోజుల కాల పరిమితిని కూడా పూర్తి చేసుకున్నాననీ, ప్రస్తుతం క్వారంటైన్ నుండి బయటికి వచ్చి, ఇంటి పనీ, వంట పనీ చూసుకుంటున్నాననీ కన్ఫామ్ చేసింది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ విషయంలో ఇలాంటి వార్తలు హల్చల్ చేశాయి. కానీ,లక్కీగా హీరోయిన్స్ ఎవ్వరికీ కరోనా పోజిటివ్ అని తేలలేదు. విదేశీ షూటింగ్స్ పూర్తి చేసుకుని వచ్చిన పలువురు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా హోమ్ క్వారంటైన్ తీసుకోవడం గమనార్హం.