అర్జున్‌ని వదిలే ప్రసక్తే లేదు: శృతి

మరిన్ని వార్తలు

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నానంటోంది కన్నడ హీరోయిన్‌ శృతి హరిహరన్‌. ఏ ఆరోపణలు అయితే అర్జున్‌ మీద చేశానో, వాటికి సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని ఆమె స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో, అర్జున్‌ అభిమాన సంఘాలు నాపై విపరీతమైన వ్యాఖ్యలు చేస్తుండడం కొంత బాధ కలిగిస్తోన్న మాట వాస్తవం అనీ, అలా వారికి ఎంటర్‌టైన్‌మెంట్‌ లభిస్తే వారిని తాను అడ్డుకోవాలనుకోవడం కూడా సబబు కాదని సెటైర్లు వేసింది శృతి హరిహరన్‌. 

ఒకవేళ అర్జున్‌ గనుక తన మీద పరువు నష్టం దావా వేస్తే, చట్ట పరంగా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమనీ, అప్పుడే న్యాయస్థానం ముందు తన వద్దనున్న ఆధారాల్ని వుంచుతాననీ, న్యాయస్థానాల్లో తనకు న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నానని అంటోంది ఈ కన్నడ భామ. అప్పుడు పొగిడి, ఇప్పుడు ప్రశ్నించడానికి బలమైన కారణాలు తన వద్ద వున్నాయంటోన్న శృతి, ఇప్పుడే కదా 'మీ..టూ..' అంటూ మహిళా లోకం గళం విప్పుతోన్నది.. అప్పుడే నోరు నొక్కేస్తారా.? అని ప్రశ్నించింది. 

ఒకరికొకరు తోడుగా, 'మీ..టూ..' ఉద్యమం బలోపేతమవుతోంది కాబట్టే, తనలోనూ ధైర్యం పెరిగి, తాను ఎదుర్కొన్న ఇబ్బందికర లైంగిక వేధింపుల పరిస్థితిని బాహ్య ప్రపంచానికి తెలియజేశానని శృతి హరిహరన్‌ అంటోంది. అయితే ఇంకోపక్క యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌కి సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతూ వస్తోంది. న్యాయపోరాటంపై విశ్వాసం వుంటే, ఆరోపణలు చేయడం కాదు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ శృతి హరిహరన్‌ని డిమాండ్‌ చేస్తున్నారు చాలామంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS