‘వకీల్‌సాబ్’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు.? మొదట్లో చాలా పేర్లు విన్పించాయి. చివరికి శృతిహాసన్ పేరు దగ్గర గాసిప్స్ ఆగాయి. నిజానికి, ‘వకీల్ సాబ్’ టీమ్ ఆమెతోనే సంప్రదింపులు జరిపిందట. అయితే, ఈ మధ్యనే శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో తాను ‘వకీల్ సాబ్’ సినిమా చేయడంలేదని ప్రకటించిందంటూ ఓ వార్త బయటకొచ్చింది. కాగా, తన తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు వేణు శ్రీరామ్ మాత్రం, ఇప్పటికైతే శృతిహాసన్‌నే హీరోయిన్‌గా అనుకున్నాం.. అంటూ అసలు విషయాన్ని చల్లగా చెప్పేశాడు. ‘అయినా మా సినిమాలో హీరోయిన్ పాత్ర నిడివి, ప్రాధాన్యత తక్కువే..’ అని వేణు శ్రీరామ్ పెద్ద బాంబే పేల్చాడు. ఇదిలా వుంటే, ‘కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగింది కదా.. ఈలోగా చాలా మారుతాయ్.. ఏమో, హీరోయిన్ కూడా మారొచ్చు..’ అనే సంకేతాల్ని పంపారు వేణు శ్రీరామ్.
‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయిపోయిందంటూ అభిమానులకు తీపి కబురు చెప్పాడు ఈ దర్శకుడు. పవన్ కళ్యాణ్‌కి తాను వీరాభిమానిననీ, అయితే కమర్షియల్ సినిమాతో ఆయన పవర్‌ని చూపించే అవకాశం మాత్రం దక్కలేదనీ, అయినాగానీ.. అభిమానుల్ని అలరించేలా సినిమా వుంటుందనీ చెప్పుకొచ్చాడు. ఇంతకీ, ‘వకీల్ సాబ్’ హీరోయిన్ ఎవరు.? మళ్ళీ వ్యవహారం మొదటికొచ్చిందన్నమాట.