డిమాండ్ ఉన్నా, లేకున్నా... పారితోషికం విషయంలో ఏకరంగానూ మొహమాట పడరు కథానాయికలు. మరీ ముఖ్యంగా స్టార్ డమ్ అనుభవిస్తున్న వాళ్లయితే... ప్రతి పైసా ముక్కు పిండి వసూలు చేస్తారు. శ్రుతి హాసన్ కూడా అంతే. చేతిలో హిట్లు ఉన్నప్పుడూ, లేనప్పుడూ తన పారితోషికం ఒకేలా ఉంటుంది. రూపాయి తగ్గించడానికి కూడా ఇష్టపడదు. రేటు తగ్గిస్తే - డిమాండ్ తగ్గిందని తమకు తాము ఒప్పుకున్నామని ఫీలైపోతారు. కాకపోతే.. ఇప్పుడు శ్రుతిహాసన్ అమాంతంగా పారితోషికం తగ్గించుకుంది. పవన్ కల్యాణ్ కోసం.
పవన్ కల్యాణ్ - శ్రుతిహాసన్‌లది హిట్ పెయిర్. 'గబ్బర్ సింగ్' లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. 'కాటమరాయుడు' సినిమా ఫ్లాప్ అయినా, అందులో పవన్ , శ్రుతిల మ్యాజిక్ కనిపిస్తుంది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి జోడీ కట్టబోతున్నారు. 'వకీల్ సాబ్' కోసం. వకీల్ సాబ్‌లో శ్రుతి ఎంట్రీ దాదాపుగా ఖాయమైంది. త్వరలోనే శ్రుతి సెట్లోకి వస్తుందని టాక్. శ్రుతి కేవలం వారం రోజుల కాల్షీట్లు ఇచ్చిందట. ఈ వారంలో శ్రుతి ఎపిసోడ్లన్నీ పూర్తి చేసేస్తారు. అందుకు గానూ శ్రుతికి 60 లక్షల పారితోషికం అందించబోతున్నారు. నిజానికి శ్రుతి పారితోషికం కోటి పైనే. కాకపోతే... పవన్ సినిమా కోసం రేటు తగ్గించుకుంది. పైగా వారంలో పని పూర్తవుతుంది. రెండు విధాలా లాభమే. అందుకే రేటు తగ్గినా, సినిమా చేయడానికి ఒప్పుకుందట.