కరోనా - లాక్ డౌన్.. 2020లో అందరినీ భయపెట్టిన పదాలు ఇవే. సినిమా వాళ్లకు మరీనూ. థియేటర్లు బంద్.. షూటింగులు బంద్. వాళ్ల జీవితమే పూర్తిగా బంద్ అయ్యాయి. అయితే కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల మంచే జరిగిందంటోంది.. శ్రుతి హాసన్.
``కరోనా ప్రపంచాన్ని భయపెట్టింది.చాలామంది మరణానికి కారణం అయ్యింది. ఇలాంటి ఉపద్రవం రావడం నిజంగా బాధాకరమైన విషయం. నాకైతే లాక్ డౌన్‌తో మంచే జరిగింది. ఎప్పుడూ లేనిది ఎనిమిది నెలలు ముంబైలో ఒంటరిగా ఉండాల్సివచ్చింది. ఒంటరితనం వల్ల నేనేం భయపడలేదు. బాధ పడలేదు. ఈ ఎనిమిది నెలలూ.. సంగీతంపై దృష్టి పెట్టా. నా తొలి సోలో ఆల్బమ్ ని లాక్ డౌన్ సమయంలోనే విడుదల చేశా. స్వరాలపై మరింత పట్టు సాధించా`` అని చెప్పుకొచ్చింది శ్రుతి.
ఈమధ్య తెలుగు సినిమాలు బాగా తగ్గించేసింది శ్రుతి. `కాటమరాయుడు` తరవాత.. `క్రాక్`లోనే కనిపించింది. ఈలోగా మూడేళ్ల గ్యాప్ వచ్చింది. సినిమా సినిమాకీ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటారు? అని అడిగితే ``నా దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా చేసేయాలని ఏం లేదు. నచ్చినవే ఎంచుకుంటున్నా. ఇది వరకు హీరోయిన్ అంటే... గ్లామర్‌కీ, రెండు మూడు పాటలకే పరిమితం అనుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదు. కనిపించేది కాసేపే అయినా, నా పాత్రకు ప్రాధాన్యం ఉండాలి`` అంటోంది శ్రుతి.