కరోనా వల్ల చాలా కష్టాలొచ్చాయి. విడుదల కావల్సిన సినిమాలు అగిపోయాయి. షూటింగులు రద్దయ్యాయి. రిలీజ్ డేట్లు మారబోతున్నాయి. ఆఖరికి స్క్రిప్టుల్లో కూడా భారీ మార్పులు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా `వకీల్ సాబ్` రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా స్క్రిప్టులో కీలకమైన మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికి దాదాపుగా మూడొంతుల షూటింగ్ పూర్తయ్యింది. పవన్ కల్యాణ్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు బాకీ. అందుకోసం హీరోయిన్‌ని అన్వేషిస్తోంది చిత్రబృందం. శ్రుతిహాసన్ ఖరారైంది. ఆమెకు సంబంధించిన పార్ట్ తీస్తే సినిమా అయిపోయినట్టే. కానీ.. కరోనా వచ్చింది. షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగులు మొదలైనా , శ్రుతి కోసం రాసుకున్న సీన్లన్నీ తీయరట. ఆమె పాత్రని కుదించి, పాటలు ఎత్తేసి, వీలైనంత మినిమైజ్ చేసి `అయ్యింది` అనిపిస్తారట.
శ్రుతిహాసన్ పాత్ర నిడివి బాగా తగ్గిపోయే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. నిజానికి హీరోయిన్ పాత్రకు ఈ సినిమాలో పెద్దగా అవకాశం లేదు. పింక్ వర్జినల్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కానీ పవన్ కోసం హీరోయిన్ పాత్రని తీసుకొచ్చారు. కరోనా వల్ల షూటింగ్ ఆగకపోతే.. శ్రుతిపై రాసుకున్న సీన్లన్నీ తెరకెక్కించేవారు. ఇప్పుడు అలా కాదు. ఆమె పార్ట్ ని వీలైనంత కుదించి, నాలుగైదు రోజుల్లోనే శ్రుతిహాసన్ పోర్షన్ పూర్తి చేయాలని చూస్తోంది. దాని వల్ల షూటింగ్ త్వరగా ముగుస్తుంది. బడ్జెట్ కూడా అదుపులోకి వస్తుంది. అదీ... దిల్ రాజు ప్లానింగ్.