ఓకే రోజు రెండు క్రేజీ సినిమాలు రావడం.. సినీ అభిమానులకు పండగ లాంటి వార్తే. కాకపోతే.... బయ్యర్లు,నిర్మాతలూ కాస్త రిస్క్‌లో పడతారు. ఎందుకంటే.. వసూళ్లని రెండు సినిమాలూ పంచుకోవాల్సివస్తుంది. ఒక సినిమా ఏమాత్రం తేడా కొట్టినా, రెండోసినిమాకి పూర్తి అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అందుకే రెండు క్రేజీ సినిమాల మధ్య కనీసం వారం రోజులైనా గ్యాప్ ఉండాలనుకుంటారు. కానీ అన్ని సందర్భాల్లోనూ అది సాధ్యం కాదు.
ముఖ్యంగా పండగ రోజులు, వరుసగా సెలవలు వస్తున్నప్పుడు సినిమాల మధ్య క్లాష్ వస్తుంటుంది. అలాంటి క్లాష్ ఇప్పుడు నాని, వరుణ్ తేజ్ సినిమాల మధ్య ఎదురు కాబోతోంది. నాని కథానాయకుడిగా నటించిన చిత్రం శ్యాం సింగరాయ్. డిసెంబరు 24న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా గని నీ అదే రోజున విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
నిజానికి డిసెంబరు 3న గని రావాల్సింది. కానీ ఇప్పుడు వాయిదా పడింది. నేరుగా నాని సినిమాపై పోటీకి దిగబోతోంది. గని టీజర్ చాలా బాగుంది. మంచి యాక్షన్ మోడ్ లో సాగింది. ఈ సినిమాపై నమ్మకాలు పెట్టుకోవచ్చన్న భరోసా టీజర్ కలిగించింది. శ్యాం సింగరాయ్ పై కూడా మంచి బజ్ ఉంది. నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మక్కువ చూపిస్తారు. కాబట్టి.. ఈరెండు సినిమాలకూ మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కాకపోతే.. రెండింటిలో ఏది నిలుస్తుందన్న విషయాన్ని కాలమే చెప్పాలి.