చూస్తుండగానే 2021కి రెక్కలొచ్చేశాయ్. ఇంకొన్ని గంటల్లో కొత్త యేడాది మొదలైపోతుంది. ఈలోగా... 2021 అందించిన జ్ఞాపకాల్ని నెమరేసుకోవడం ఓ బాధ్యత. 2021 మనకు మిక్స్డ్ ఎమోషన్స్ నింపింది. ఎన్నో తీపి, చేదు అనుభవాలు అందించింది. చిత్రసీమకూ అంతే. 2021లో భాషలకు అతీతంగా సినిమా పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకుల్ని అనుభవించింది. వాటి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. 2021లో చాలా హిట్ సినిమాలొచ్చాయి. అంతకు మించిన ఫ్లాపులూ కనిపించాయి. డబ్బులు తీసుకొచ్చిన సినిమాలు కొన్నుంటే, గౌరవాన్ని అందించిన ప్రయత్నాలు ఇంకొన్ని. 2021లో విమర్శకుల మన్ననలు పొందిన మేటి చిత్రాలు కొన్ని కనిపించాయి. రివ్యూల పరంగా, ప్రేక్షకుల అభిమానం పరంగా.. లెక్కేస్తే జై భీమ్, నాంది, సినిమా బండి.. ఈ జాబితాలో కనిపిస్తాయి.
సూర్య నటించిన అనువాద చిత్రం `జై భీమ్`. ఇందులో సూర్య చంద్రు అనే లాయర్ పాత్రలో కనిపించారు. 96 వేల కేసుల్ని వాదించిన న్యాయవాది పాత్రలో... సూర్య అద్భుతమైన నటన ప్రదర్శించారు. అణగారిన జీవితాల్ని, అందులోని వ్యధల్ని.. దర్శకుడు హృద్యంగా ఆవిష్కరించాడు. అన్ని వెబ్ సైట్లూ... ఈ చిత్రాన్ని ఈ యేడాది మేటి చిత్రంగా అభివర్ణించాయి. ఒక్కో సన్నివేశం.. ఒక్కో ఎమోషన్‌కి అందించింది. చివర్లో పాప కాలుమీద కాలు వేసుకునే ఫోజు.. ఈ యేడాది టాక్ ఆఫ్ ది మూవ్ ... అయ్యింది. అలా.. జై భీమ్ పోస్టర్ 2021 క్యాలెండర్ లో రెపరెపలాడింది.
సామాజిక ఇతివృత్తంతో సినిమాలు మిగిలిన భాషల్లోనే వస్తాయనుకుంటే పొరపాటే. తెలుగులోనూ అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు `నాంది` నిదర్శనం. చట్టాలపై అవగాహన కల్పిస్తూ.. తీసిన సినిమా ఇది. ఎప్పుడూ వినోదాత్మక పాత్రలు పోషించే నరేష్.. తొలిసారి ఓ సీరియస్ రోల్ లో కనిపించడం విశేషం. కోర్టు రూమ్ డ్రామాని అత్యంత పకడ్బందీగా నడిపించిన వైనం, ఇందులోని బలమైన అంశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. 2021లో తప్పకుండా చూడాల్సిన సినిమాల జాబితాలో.. నాంది చేరిపోయింది. ఎన్నో ఫ్లాపుల తరవాత.. నరేష్ కి ఓ మంచి విజయాన్ని అందించింది. ఓరకంగా నరేష్ గౌరవాన్ని పెంచిన సినిమాగా మిగిలిపోయింది.
ఓటీటీలో విడుదలైన చిన్న సినిమా `సినిమా బండి`. ఇందులో స్టార్లు లేరు. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ లేరు. అసలు ఈ సినిమాకి సరైన బడ్జెట్టే లేదు. అందుబాటులో ఉన్న వనరులతో, పూర్తిగా కొత్త వాళ్లతో చేసిన ఈ సినిమా ఓ ప్రయోగంగా మిగిలిపోయింది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. కొత్తగా సినిమా తీయాలనుకునేవాళ్లకీ, జీరో బడ్జెట్ తో ఓ ప్రయోగం చేద్దామనుకున్నవాళ్లకి కచ్చితంగా `సినిమా బండి` స్ఫూర్తినిస్తుంనడంలో ఎలాంటి సందేహం లేదు.