ఈమధ్య కాలంలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం చాలా కష్టం అయిపోయింది. ట్రైలర్, టీజర్, టైటిల్ ఇలా.. ఏదో ఓ విషయంలో ఇంపాక్ట్ చూపించకపోతే టికెట్లు తెగడం కష్టం. అందుకే చిన్న సినిమాలు టెప్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. `సిద్దార్థ్ రాయ్` ట్రైలర్ కూడా ఇదే లక్ష్యంతో కట్ చేసినట్టు అనిపిస్తోంది. `అతడు` లాంటి సూపర్ డూపర్ హిట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. యశస్వీ దర్శకుడు. ఫిబ్రవరిలో విడుదల అవుతోంది. ట్రైలర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
లవ్ మేకింగ్, ముద్దులు, బోల్డ్ సీన్స్... ట్రైలర్ అంతా ఇదే. హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా, టిపికల్ గా కనిపిస్తోంది. లవ్ కంటే లవ్ మేకింగ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఎమోషన్ లెస్ క్యారెక్టర్ అది. ఎమోషన్స్ కంటే లాజిక్కులే ముఖ్యమని భావించే హీరో, లవ్ లో పడితే ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. షాట్స్, డైలాగ్స్, క్యారెక్టరైజేషన్స్ లో బోల్డ్ నెస్ పుష్కలంగా కనిపిస్తోంది. కేవలం యూత్‌ని ఎట్రాక్ట్ చేయడానికి ఈ ట్రైలర్ కట్ చేసినట్టు అనిపిస్తోంది. సినిమాకు మహారాజా పోషకులు వాళ్లే కాబట్టి.. ఈ సినిమాకి టికెట్లు తెగడం ఖాయంగా అనిపిస్తోంది.
ఇటీవల విడదలైన `యానిమల్` ప్రభావం ఈ సినిమాపై పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సుకుమార్ కూడా ఈ సినిమా టీజర్ చూసి దర్శకుడికి తన బ్యానర్లో ఓ ఛాన్స్ ఇచ్చాడు. ఇలా ఎలా చూసినా.. ఈ సినిమాకి హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.