స్ఫూర్తి అనుకోండి, కాపీ అనుకోండి. పాత సినిమాలు, నవలల ప్రభావం ఈనాటి సినిమాపై గట్టిగా పడుతోంది. కొంతమంది కాపీ రైట్స్ తీసుకొంటున్నారు. ఇంకొంతమంది కాపీనే రైట్ అనుకొంటున్నారు. అందుకే సినిమాలు విడుదల అయిన తరవాత వివాదాలు చుట్టు ముడుతున్నాయి. తాజాగా ధనుష్ సినిమా `కెప్టెన్ మిల్లర్` కూడా ఇలాంటి వివాదాన్నే ఎదుర్కొంటోంది. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవల సంక్రాంతికి తమిళనాడులో విడుదలై మంచి టాక్ సంపాదించుకొంది. ఈ సినిమా ‘పట్టత్తు యానయ్’ అనే నవలని కాపీ కొట్టి తీశారని తమిళనాట ఓ వివాదం మొదలైంది. ఈ నవలని రామమూర్తి రాశారు. ఆయన నటుడు కూడా. ఆయనే ఇప్పుడు ధనుష్ అండ్ టీమ్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
తన నవల కాపీ కొట్టినందుకు బాధగా లేదని, కనీసం తన అనుమతి అయినా తీసుకోవాల్సిందని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని తమిళ దర్శకుల సంఘానికి రామమూర్తి ఓ లేఖ రాశారు. తను ఇదంతా డబ్బుల కోసమో, పేరు కోసమో చేయడమ లేదని... ఓ రచయితగా తనకు రావాల్సిన కనీస గుర్తింపు కోసమే ఈ విషయాన్ని దర్శకుల సంఘం ముందుకు తీసుకెళ్లాలని, తనకు అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు రామమూర్తి.
ధనుష్ ప్రతిభావంతుడైన నటుడని, పెద్దల్ని, కళాకారుల్ని గౌరవిస్తాడని, అలాంటి నటుడు.. ఓ కాపీ రచనని ఎలా ఒప్పుకొన్నాడని ఆయన ప్రశ్నిస్తున్నారు. రామమూర్తి సీనియర్ నటుడు అవ్వడం వల్ల ఈ వివాదానికి ప్రాధాన్యత పెరిగింది. అసలింతకీ ఆ నవలలో ఏముంది? నిజంగానే కాపీ కొట్టారా? లేదంటే ఇదంతా కేవలం కట్టు కథా? అనేది తెలుసుకొనే పనిలో ఉంది తమిళ దర్శకుల సంఘం.