నాని పక్కన సిద్దార్థ్ విల‌నిజం పండించ‌గ‌ల‌డా?

By iQlikMovies - November 30, 2018 - 18:44 PM IST

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య మ‌న క‌థానాయ‌కుల‌కు విల‌నిజంపై మోజు పెరుగుతోంది.  రానా, ఎన్టీఆర్ లే ప్ర‌తినాయ‌క పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌మిళంలో అయితే.. ఈజాబితా ఇంకాస్త ఎక్కువ‌గా ఉంది. 'రోజా' తో అమ్మాయిల మ‌న‌సుల్ని దోచుకున్న‌ అర‌వింద్ స్వామి విల‌న్ పాత్ర‌ల‌తోనూ త‌న ప్ర‌తాపం చూపిస్తున్నాడు. తాజాగా సిద్దార్థ్ కూడా ప్ర‌తినాయ‌కుడిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు.

విక్ర‌మ్ కె.కుమార్ - నాని కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర చాలా కీల‌కం. ఆ పాత్ర కోసం సిద్దార్థ్ ని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. బొమ్మ‌రిల్లు,  నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట లాంటి వ‌రుస హిట్ల‌తో దూసుకుపోయిన సిద్దార్థ్‌... ఇప్పుడు త‌న ఉనికిని కాపాడుకునే ప‌నిలో ఉన్నాడు. క‌థానాయ‌కుడిగా త‌న‌కు అవ‌కాశాలు రావ‌డం లేదు. ఇలాంటి ద‌శ‌లో... విక్ర‌మ్ కె.కుమార్ లాంటి ద‌ర్శ‌కుడు ఆహ్వానిస్తే.. కాద‌న‌కుండా ఎలా ఉంటాడు?

అందుకే.. విక్ర‌మ్ ప్ర‌తిపాద‌న‌కు దాదాపుగా ఓకే చెప్పే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే... ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ఉన్న సిద్దూలో క్రూర‌త్వం ప‌లుకుతుందా? అనేదే డౌటు.  కాక‌పోతే ఇలాంటి ఇమేజే ఉన్న జ‌గ‌ప‌తిబాబు, అర‌వింద్ స్వామిలు విల‌న్ పాత్ర‌ల్లో దూసుకుపోతున్నారు క‌దా?  ఆ ధైర్యంతోనే సిద్దూ కూడా ముంద‌డుగు వేసే అవ‌కాశం ఉంది. ఈ పాత్ర గ‌నుక క్లిక్ అయితే... సిద్దూ కెరీర్ ట్రాక్‌లో ప‌డిపోవ‌డ‌మే కాదు, తెలుగు చిత్ర‌సీమ‌కూ ఓ కొత్త విల‌న్ దొరికిన‌ట్ట‌వుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS