'రంగస్థలం' పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఓ రివేంజ్ డ్రామా. కానీ, 'వాల్మీకి' గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఓ ఎంటర్‌టైనింగ్ డ్రామా. ఈ రెండింటికీ ఎక్కడ పోలికా.? అని ఆశ్చర్యపోతున్నారా.? రెండింట్లోనూ మెగా కాంపౌండ్ హీరోలే. ఇద్దరు హీరోలు గెడ్డంతో కనిపిస్తున్నారు. ఇది ఓ పోలిక. మరో పోలికేంటంటే, హీరోయిన్. రెండింట్లోనూ హీరోయిన్లు పల్లెటూరి అమ్మాయిలే. లంగా వోణీలు ధరించి చక్కగా పదహారణాల పడుచు పిల్లల్లా కనిపిస్తున్నారు.
ఇద్దరికీ సైకిల్ తొక్కడం వచ్చండోయ్. 'రంగస్థలం'లో సమంత సైకిల్ తొక్కుతూ, అమాయకంగా కనిపించే పోస్టర్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 'వాల్మీకి'లో పూజా హెగ్దే కూడా సైకిల్ తొక్కుతూ, లంగా వోణీ, రెండు జడలతో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపిస్తోంది. ఇవే 'రంగస్థలం'తో 'వాల్మీకి'ని పోల్చేందుకు కారణాలుగా కనిపిస్తున్నాయంతే. కథనం పరంగా, ఆ సినిమాకీ, ఈ సినిమాకీ అస్సలు పోలికే ఉండదండీ బాబూ. ఇకపోతే, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం రిలీజ్ డేట్‌లో చిన్న చిన్న మార్పులు జరిగాయని తెలుస్తోంది. ట్రిపుల్ ఎక్స్ సోప్‌లా మార్పు మంచిదే, అదే రోజు నాని తన లేడీ గ్యాంగ్‌ని వెంటేసుకుని, 'గ్యాంగ్ లీడర్'గా వచ్చేస్తున్నాడు. ఎందుకొచ్చిందిలే ఈ 'గ్యాంగ్ లీడర్'కి కాస్త ప్రైవసీ ఇచ్చేద్దామని 'వాల్మీకి' అండ్ టీమ్ అనుకుంటోందట. ఆ క్రమంలో 'వాల్మీకి' ఆ తదుపరి వారం, అంటే, సెప్టెంబర్ 20న విడుదల చేయాలనుకుంటోందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఆందుతోన్న సమాచారమ్.