"వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూసానే" (ఖైదీ)
"పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవప్రణయ దేవతలకు ఆవాహనం" (అన్నమయ్య)
"గుండెనిండ గుడిగంటలు..." (శుభాకాంక్షలు)
"గుడిగంటలు మ్రోగేవేళ మది సంబరపడుతోంది..." (నిన్నే ప్రేమిస్తా)
ఇలా ఒకటి కాదు, నాలుగు కాదు...వెతికితే ఎన్నో పాటల్లో ప్రేమని, స్త్రీ సౌందర్యాన్ని దైవంతో సమానంగా వర్ణించిన సందర్భాలు తెలుగు సినిమాల్లో అనేకం. అవన్నీ వివాదాలు కాలేదు. ఎందుకంటే అప్పట్లో "మనోభావాలు దెబ్బతినడం" అనబడే కాలక్షేపచర్య పెద్దగా ప్రాచుర్యం పొందలేదు.
కొత్తగా అల్లు అర్జున్ "డీజే"లో సాహితిగారు వ్రాసిన "గుడిలో బడిలో మడిలో ఒడిలో..." పాటలో "ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం...ప్రవరలో ప్రణయమంత్రమే చూసి పులకిరించింది ఆ చమకం" అనడం వల్ల శివుడేమీ మూడొకన్ను తెరిచేయడు.
కళ్లుమూసుకుని నమకం, చమకం పదాలున్న ఈ పాట వింటుంటే అమ్మవారితో ఆనందతాండవం చేసే శివుడు కనిపించాడు నాకు. "అగ్రహారాల తమలపాకల్లే తాకుతోంది తమకం..." అనడం ప్రేమకి పవిత్రత ఆపాదించడానికి రాసిందే. పాన్ షాపులో తమలపాకల్లే అంటే చీప్ అయిపోయేది కదా!
మనం చూసే దృష్టిని బట్టే విషయం కనిపిస్తుంది. ఇందులో వాడిన పదాలవల్ల ప్రేమకి పవిత్రత పెరిగిందే తప్ప, ఆ పదాలకి పవిత్రత తగ్గలేదు.
అప్పట్లో ఒక 70 ఏళ్ల కృష్ణభక్తురాలు ఖడ్గంలో "నువ్వు నువ్వు నువ్వే నువ్వు.." పాట విని, "ఆ పాట వింటున్నంతసేపు నాకు కృష్ణుడే కనిపించాడు..రాసినాయన ఎంత బాగా రాసాడో" అంది. నేను తర్వాత ఆ యాంగిల్లో విన్నాక అది నిజంగా భక్తిపాటలాగే అనిపించింది. అప్పట్నుంచీ నేను వింటున్న చాలా ప్రేమపాటలు భక్తిపాటల్లా వినిపించడం మొదలుపెట్టాయి. నిజానికి ప్రేమకి, భక్తికి పెద్ద తేడాలేదు.
ఇలా మనోభావాలు రకరకాలుగా ఉంటాయి. నిజంగా ఒక వర్గం స్వాభిమానమ్మీద ఎటాక్ జరిగే విధంగా కంటెంట్ ఉంటే నిరసన వ్యక్తం చేయడం సమంజసం. కానీ ఇలా ప్రతివిషయానికి మనోభావాలు దెబ్బతినేస్తుంటే మనోభావాలు అన్న పదమే హాస్యాస్పదమై పోతుంది. మీడియాకి, జనానికి కాలక్షేపం తప్ప చివరగా ఒనగూరేది కూడా ఏమీ ఉండదు.
-సిరాశ్రీ