గత రెండు మూడు నెలలుగా టాలీవుడ్ ని వరుసగా పరాజయాలు వెక్కిరిస్తూనే వచ్చాయి. జులైలో అయితే నిర్మాతలంతా కుదేలైపోయారు. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్ డే, థ్యాంక్యూ, ది వారియర్, రామారావు ఆన్ డ్యూటీ.. ఇలా వరుసగా అన్నీ ఫ్లాపులే. ఒక్క సినిమా కూడా కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టీ ఆగస్టుపై పడింది. ఈనెలలో క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అన్ని సినిమాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో ఒకట్రెండు హిట్లు పడినా టాలీవుడ్ మళ్లీ తేరుకుంటుంది. అందుకే ఆగస్టు సినిమా ఫలితాలపై టాలీవుడ్ ఆసక్తి కనబరుస్తోంది.
`సీతారామం`తో ఆగస్టుకి టాలీవుడ్ శ్రీకారం చుట్టబోతోంది. ఈనెల 5న ఈ సినిమా విడుదల కానుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అదృష్టం ఏమిటంటే.. ఈ సినిమాపై ముందు నుంచీ పాజిటీవ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. పాటలు, ప్రచార చిత్రాలూ... ఇదో హిట్ సినిమా అనే సంకేతాలు పంపుతున్నాయి. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. దుల్కర్ సల్మాన్ కథల ఎంపికపై టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం గట్టి నమ్మకం ఉంది.
దుల్కర్ ఓ కథని ఎంచుకొన్నాడంటే కచ్చితంగా విషయం ఉండే ఉంటుందని అంతా అంటుంటారు. అందుకే సీతారామంపై పాజిటీవ్ వైబ్స్ మొదలయ్యాయి. పైగా నెల రోజుల నుంచి విరామం లేకుండా ఈ సినిమా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. ఆగస్టులో ఇన్ని సినిమాలు వస్తున్నా - ప్రమోషన్ల విషయంలో సీతారామంకి అగ్ర తాంబూలం ఇవ్వాల్సిందే. ఆగస్టు 5నే `బింబిసార` వస్తోంది. కల్యాణ్ రామ్ నటిస్తూ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రమిది. ఎన్టీఆర్ సైతం ఈ సినిమా కోసం బరిలోకి దిగి గట్టిగా ప్రమోష్ చేస్తున్నాడు. ఇదే నెలలో మాచర్ల నియోజక వర్గం, కార్తికేయ 2, లైగర్ వస్తున్నాయి. అన్ని సినిమాలపైనా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రాల్లో సీతారామం, లైగర్‌లు కచ్చితంగా హిట్ చిత్రాల జాబితాలో చేరబోతున్నాయని ముందే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలినవాటిలో ఒక్క సినిమా హిట్ అయినా... ఆగస్టులో టాలీవుడ్ కి ఆశాజనకరమైన ఫలితాలు వచ్చినట్టే. ఈ విజయాలు నిర్మాతలకు కావల్సినంత బూస్టప్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.