ప్రేమ కథల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు హను రాఘపూడి. మణిరత్నం తరహాలో హను ప్రేమకథలు ఒక ప్రత్యేకమైన మార్క్ లో వుంటాయి. ఇప్పుడు ఆయన నుండి వస్తున్న మరో ప్రేమకథ సీతారామం. వైజయంతి మూవీస్ నిర్మాణం. దుల్కల్ సల్మాన్, రష్మిక మందన సుమంత్, మృణాల్ ఠాకూర్, భూమిక, తరుణ్ భాస్కర్ ఇలా భారీ తారాగణం వుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ ప్యూర్ ప్రేమకథ అనే ఫీలింగ్ ఇచ్చాయి. 65, 80 నేపధ్యాలలో సాగుతున్న ఈ చిత్రం కథ గురించి మరో ఆసక్తికరమైన అంశం తెలిసింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే మహానటి తరహాలో ఉంటుందని సమాచారం.
మహానటిలో సావిత్రి కథ జర్నలిస్ట్ లుగా సమంత, విజయ్ దేవరకొండ చెప్తుంటారు. కథ రెండు కాలాలలో జరుగుతుంది. సీతారామంలో అదే స్క్రీన్ ప్లే స్టయిల్ ని ఫాలో అయ్యారని తెలిసింది. రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరవేసే భాద్యత రష్మిక మీద పడుతుంది. రష్మిక, తరుణ్ భాస్కర్ సాయంతో సీత కోసం అన్వేషణ మొదలుపెడుతుంది. ఈ అన్వేషణలో సీతా రామ్ ల కథ ఏమిటో ప్రేక్షకులకు చూపిస్తారు. మహానటి స్క్రీన్ ప్లే కూడా ఇదే. ఇలాంటి స్క్రీన్ ప్లే తో మహానటి క్లాసిక్ గా నిలిచింది కాబట్టి రిస్క్ లేని మోడల్ అనే అనుకోవాలి. ఆగస్ట్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.