'బాహుబలి ది బిగినింగ్' ఇంట్రడక్షన్లోనే శివగామి పాత్రలో రమ్యకృష్ణ, పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుంది. అదేమిటి? 'బాహుబలి'ని కట్టప్పతో చంపించడమేనా?..కానీ ఇప్పుడు కొత్త కథ వినిపిస్తోంది. రాజ్యాన్ని కాదనుకుని, శతృరాజ్యానికి చెందిన దేవసేనను వివాహమాడతాడట బాహుబలి. దేవసేన గొప్పతనాన్ని శివగామి మెచ్చుకుని, పెళ్ళికి ఒప్పుకుంటుందిగానీ, బిజ్జలదేవ, భళ్ళాలదేవ కలిసి బాహుబలికి వ్యతిరేకంగా కుట్రపన్ని, శివగామిలో బాహుబలి పట్ల ద్వేషం పెరిగేలా చేస్తారట. పరిస్థితులు వారు చెప్పినట్లే కనిపించడంతో శివగామి, బాహుబలిని చంపేయమని కట్టప్పను ఆదేశిస్తుందనీ, అందుకే కట్టప్ప - బాహుబలిని చంపేశాడని కొత్త కథ వినవస్తోంది. అయితే ఇలాంటి కథలు ఎన్నో వచ్చాయి. 'బాహుబలి' కన్నా ఈ కట్టప్ప మీదనే ఇంకో రెండు మూడు పార్టులతో రాజమౌళి ఓ సినిమా తీసేయొచ్చేమో అన్నంతలా నెటిజన్లు కథలు రాసేస్తున్నారు. ఏదేమైనా ఇంకొద్ది రోజులే మిగిలి ఉంది సస్పెన్స్ వీడిపోవడానికి. ఏప్రిల్ 28వ తేదీన అన్ని ప్రశ్నలకూ సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే అదే రోజు ఈ సినిమా ప్రేక్షకులందరి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేందుకు భారీ అంచనాలతో వచ్చేస్తోంది. 'బాహుబలి' కోసం రాజమౌళి చెప్పిన కథేంటో తెలియాల్సిన రోజు అదే మరి. అప్పటిదాకా ఈ కథలు తప్పవు.