సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రాజకీయాలపై దృష్టిపెట్టిన సినీ నటుడు శివాజీ, కొంత చిత్తశుద్ధితోనే ప్రత్యేక హోదా ఉద్యమంపై పోరాటం చేశారు. అయితే అనూహ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీ టర్న్ తీసుకోవడంతో ఆయన పట్ల అప్పటిదాకా చాలామందిలో వున్న సానుభూతి కొంత మేర తగ్గిందనే అంటుంటారు చాలామంది.
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళడం, ఏదో ఒక పార్టీ వైపు టర్న్ తీసుకోవడం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. అయితే శివాజీ ఒకింత ఎగ్రెసివ్‌గా వెళ్ళారు. ఈ క్రమంలోనే ఆయన 'ఆపరేషన్ గరుడ' అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. అది ఏ ఉద్దేశ్యంతో తెరపైకొచ్చిందోగానీ, అందులో చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ రాజకీయ నాయకుడైన వైఎస్ జగన్ మీద ప్రాణాపాయం లేని దాడి జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది.
దాంతో, ఇప్పుడంతా ఆపరేషన్ గరుడ గురించే చర్చించుకుంటున్నారు. అసలు ఆపరేషన్ గరుడ గురించి శివాజీకి సమాచారం ఎలా అందింది? అని చర్చ వస్తోంది. ఇంకొందరు శివాజీపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో, రేపో మాపో పోలీసులు జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి శివాజీని కూడా ప్రశ్నించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అయితే తనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఆపరేషన్ గరుడ గురించి వివరాలు వెల్లడిస్తున్నట్లు గతంలో తెలిపారు శివాజీ.
మరి ఈ దాడిపై ఆయన స్పందన ఎలా వుంటుంది? పోలీసులకు ఆయన ఏం చెబుతారు? రాజకీయంగా ఆయన తదుపరి చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలిక.