సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి తేజ్, 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. టాలీవుడ్‌కి సంబంధించి దాదాపు తొమ్మిది నెలల తర్వాత సినిమా థియేటర్లలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ఇది. థియేటర్లు తెరిచే విషయమై ఇంకా కొంత గందరగోళం వుంది. కొన్ని చోట్ల థియేటర్లు తెరచుకున్నాయి.. కొన్ని చోట్ల ఇంకా సవాలక్ష సమస్యలున్నాయి.
థియేటర్ల యాజమాన్యాలకీ, డిస్ట్రిబ్యూటర్లకీ, నిర్మాతలకీ మధ్య పంచాయితీ తెగలేదు. ఈ పరిస్థితుల్లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, 'సోలో బ్రతుకే సో బెటరు' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తే.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చూపించే స్టామినా ఎలా వుంటుంది.? అన్న ఉత్కంఠ అందరిలోనూ కన్పిస్తోంది. సినిమా థియేటర్లలో సగం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతినిస్తున్నారు.
సామర్థ్యంలో సగం అంటే, వసూళ్ళలోనూ సగమే కదా.! మరి, ఒకప్పటి సంచలనాల్ని ఇప్పుడు సినిమా థియేటర్లలోచూడగలమా.? కష్టమే మరి.. కష్టమేంటి, ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం. పైగా, కొన్ని థియేటర్లు తెరిచే విషయమై ఇంకా సందిగ్ధం నెలకొంది. యూఎస్ (అమెరికా) మార్కెట్ తెలుగు సినిమాకి మరో మేజర్ పిల్లర్. కానీ, అక్కడా కరోనా తీవ్రత నేపథ్యంలో సినిమాలకు జనాలు వెళ్ళడం అనేదానిపై అనుమానాలు చాలానే వున్నాయి. ఇంత గందరగోళం నడుమ, 'సోలో బ్రతుకే సో బెటర్' పరిస్థితేంటోగానీ, 'సోలో రిలీజ్' మాత్రం ఖచ్చితంగా కలిసొస్తుందనే ఆశాభావం అయితే అందరిలోనూ వుంది.