కరోనా కాలంలో రియల్ హీరోగా ఆవిర్భవించాడు సోనూ సూద్. ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సాయం కావాలన్నా `నేనున్నా` అంటూ ప్రత్యక్షమైపోయాడు. సోనూ దానగుణం చూసి అంతా ఆశ్చర్యపోయారు. కలియుగ దానకర్ఱుడు అంటూ కితాబులు ఇచ్చారు. ఇది వరకటి సోనూ వేరు, ఇప్పటి సోనూ వేరు. అలా మారిపోయింది తన ఇమేజ్. దాంతో నిర్మాతలు, దర్శకులు సోనూ వెంట పడడం మొదలెట్టారు. తెలుగులో వరుసగా తనకు ఆఫర్ల మీద ఆఫర్లు అందుతున్నాయి.
ఈ క్రేజ్ చూసి, అమాంతంగా తన పారితోషికం పెంచేశాడట సోనూ. ఇండ్రస్ట్రీలో అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. కాకపోతే.. సోనూ సూద్ పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవల బోయపాటి - సోనూ మధ్య భేటీ జరిగిందని టాక్. ఈ సినిమాలో నటించడానికి సోనూ ఒప్పుకున్నాడట. అయితే.. పారితోషికం మాత్రం ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేశాడట. నిన్నా మొన్నటి వరకూ సోనూ పారితోషికం కోటి రూపాయలే. ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెంచేశాడు. డిమాండ్ ఉన్నప్పుడే.. నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి. సోనూ అదే చేస్తున్నాడేమో..?